Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాట

"హేమ్నః సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా" అను మహాకవి కాళిదాసుని చారుతరోపదేశము ననుసరించి, ఎట్టి విలువగల వస్తువైనను పరిశోధింప బడకయే ప్రతిష్ఠ నందజాలదు అట్లని విపరీత పరీక్షకు బూనుచో శ్రేష్ఠతరమైన రత్నము గూడ రాయిగా నిర్ణయింపబడవచ్చును. అందుకని విమర్శకునకు పరిశీలనపట్ల నా యా వస్తువుల యోగ్యతాజ్ఞానము కూలంకషముగ నుండి యున్ననే యది సహృదయుల సంభావనకు పాత్రము కాగలదు. లోకమందలి దోషజ్ఞుల కెల్లరకును నిట్టి యలౌకిక ప్రతిభ యదృష్టవశముననే పట్టును. ఐనను సామర్థ్యమున్నంతమట్టుకు అక్షరాస్యు లూరకుంట పాడి కాదు. పునఃపునరభ్యాస వశమున కొందరుత్కృష్ట పరీక్షకులుగను దేలవచ్చును. నీట మునుగకుండ ఈత నేర్చినవారు గలరా? తెలిసిన దానిని దేల్చుకొనుటకును కొందరు కలమును గదలింతురు. ప్రపంచమునంతను మెప్పింప బ్రహ్మతరము కాదన్నట్లు ప్రతి కృతియందును ఏదో కొరత యుండక తీరదు. ఈ వినయమును పరీక్షకులు దురుపయోగ పరపకుందురు గాక!

వివిధ భాషా విశారదులైన శ్రీ సురవరము ప్రతాపరెడ్డి బి. ఎ. బి.యల్. గారు ఇటీవల సంస్కృత గ్రంథములను గూడ సానబట్టుటకు బూనినారు. వారెద్దానినైనను ఊరక వదలువారు కారు. విశ్వవిఖ్యాతమైన వాల్మీకి రామాయణమును శ్రీ రెడ్డిగారు ఆత్మవిజ్ఞానాభివృద్ధికొరకు పఠించినను ఆ పఠనమును ఉపయోగింపదలచి యొక విమర్శలేఖను వ్రాయ నారంభించి యందలి కొంత భాగమును విద్వాంసుల పరిశీలనకై హైదరాబాదు ఆంధ్ర విజ్ఞాన వర్ధినీ పరిషన్ముఖమున శ్రుతపరచిరి. తరువాత నా వ్యాసమే విశదముగ “రామాయణ విశేషములు" అను