Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi


కీ. శే. శ్రీ ప్రతాపరెడ్డి గారి పేరుతో హైదరాబాదులో వాఙ్మయ పరిశోధన మొనర్చు వారి కొక యుపకార వేతనము నెలకొల్పవలయునని వారి కుమారుల యొక్కయు మాయెక్కయు తలంపు. దీనికై కనీస మేబదివేల ధనము మొదట ప్రోగుచేయబడవలెను. రెడ్డిగారి ముద్రితాముద్రిత గ్రంథములన్నియు ప్రకటించి వానిపై వచ్చెడు రాబడి నంతయు నిధిగా నొనర్చి దాని వడ్డీతో నీ యుపకార వేతన మీయవలయునని మా యభిప్రాయము. అందుకై రామాయణ విశేషముల ముద్రణ మారంభ ప్రయత్నము. తరువాత ఒక్కటొక్కటిగా వారి గ్రంథములు ముద్రింపింతుము. అటుపై నిధిని కూర్చుటకై ఆంధ్ర దేశము నర్థింతుము. ఆంధ్రలోకము మా యీ ప్రయత్నమును మన్నించునని యాకాంక్ష.

రెడ్డిగారి కత్యంత స్నేహపాత్రులగు శ్రీ అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింకొక పీఠిక వ్రాసి దీనికి వన్నె గూర్చినారు. వారికి మా కృతజ్ఞతలు. గ్రంథ ముద్రణమునకు కావలసిన ఆర్థిక సహాయ మొనర్చిన శ్రీ ఎస్. ఎన్. రెడ్డిగారికిని, శ్రీ దామోదర రెడ్డిగారికిని, మా సంఘ సహాయ కార్యదర్శి శ్రీ ఉరుపుటూరి రాఘవాచార్యులవారికిని మా కృతజ్ఞతలు. సారస్వత ప్రియు లెందరో గ్రంథ ముద్రణమునకై విరాళములిచ్చినారు. వారికి నా నమోవాకములు.


హైదరాబాదు,
ఫాల్గుణ శుద్ధ సప్తమి.
శా. శ. 1878

బి. రామరాజు
కార్యదర్శి
ఆంధ్ర రచయితల సంఘం.

(ద్వితీయ ముద్రణ సంపాదకీయం)