21 తృతీయాశ్వాసము
తే. వింతవింతగఁ గలసినయంత సరియె
యెమ్మెకానిమనోభావ మెఱుఁగ వలదె
యేమినేరని నిన్నటియింతమొటికె
నన్ను విడనాడనా కోరెఁ జిన్నిచిలుక. 14
తే. కాని పదరకు మిఁకమీఁద దానిమోము
గనఁగ వల దని శౌరిని గట్టిపెట్టి
బింకములు కూల నరకాలఁ బెట్టి నేల
రాచకున్నను నాపేరు రాధ గాదు. 15
క. అన విని శుక మి ట్లనియెను
వనితా యేమందు దానివగలో త్రుళ్ళో
మినుకో తెలివో గెలివో
విను వెన్నకుఁ బండ్లు వచ్చువిత మాయెఁ గదే. 16
తే. చూపులోపల నొకవింతచూపుతళుకు
నడుపులోపల నొకవింతనడుపుబెళుకు
నుండు నునికికి నొకవింతనుండుకులుకు
వచ్చెఁగదవమ్మ మనయిళావనిత కిపుడు. 17
తే. లేనిపట్టింపు లెల్లను బూని చాన
నేనె యెదురైన నిం తైనఁ గాని చూడ
దల్పునకుఁ గల్మి వచ్చిన నర్ధరాత్రి
గొడుగు తెమ్మన్నకత గాను కోమలాంగి. 18
తే. పడఁతి మును దెల్పనా పదింబదిగ నేను
దాని వినయంపుపోకిళ్లు తగ నెఱింగి
మానిసిని జేయవలదమ్మ దీనిఁ జేర్చి
తెలియ నిది మేకవన్నియపులి యటంచు. 19
వ. అనిన మధురవాణి యనుమధుపవేణి యవ్విరిబోణి నవలోకించి యిట్లనియె. 20