పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము. 19

సీ. ఒమ్ముగా దిమ్ము లై రొమ్ము రావలె నంచుఁ
గులదేవతల నెల్లఁ గోరి కొలుచు
నిడుద లై మెఱుఁగెక్కి నెరికురుల్ పెరుఁగంగ
దిన మొకతైలంబు దెచ్చి యంటుఁ
గలికి కన్నెరికంబు దొలఁగఁ జెంచుల కెంతొ
యిచ్చి తీసినమందు లిచ్చు నిచ్చ
[1]నెప్పు డీడేరునో యీముద్దరా లని
యుపవాస మొకవేళ నుండనియదు
తే. గీ. వగలు గైసేసి చెలి యుండు సొగసుఁ జూచి
దృష్టిపై దృష్టి తీసుక తెఱవ నాదు
సవతి వౌదువె యని చెక్కుఁ జఱచి మోము
మోమునఁ గదించి నూఱాఱు ముద్దు లిడును. 61

కం. సతి నిట్లు రాధికామణి
సతతము గసుగందనీక చనువున మనిచెన్
రతిమగనితోఁటలోపల
లతకూనను బెంచినటుల లలితము గాఁగన్. 62

తే. గీ. కొమ్మ కటు యౌవ్వనవసంతఁగుణ మెసంగఁ
దొలుతఁ గనుపట్టుబాల్యజాతులు దొలంగెఁ
గరము చివురులు తొవ రెక్కెఁ గడమతావు
లొఱపు మీఱెను గోకిలస్వరము లొదవె. 68

సీ. అధరబింబంబున కరుదెంచుచిలుకల
పలుకులో యన ముద్దుపలుకు లమరె
ముఖచంద్రమండలంబును గ్రహింపఁగ వచ్చు
పెనురాహువో యన వేణి యమరె
నలు వొందునాభిపున్నాగంబునకుఁ బాఱు
నళులబా రనఁగ నూఁగారు దనరెఁ

  1. నెపు డీడు మీఱునో [మూ.]