పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోమతొళజేంద్రవరతనూజుండు శ్రీప్ర
తాపసింహక్షమాపాలతల్లజుండు. 13

సీ. తనయార్యనుతమహౌదార్యవిస్ఫురణంబు
లేఖద్రుఁ బం డ్లిగిలింపఁజేయ
దనరామభక్తిప్రధానమానసశుద్ధి
నారదు వెలవెలఁ బాఱఁ జేయఁ
దనసర్వవిద్యావధానమేధాస్ఫూర్తి
పన్నగేంద్రునితలల్ వంపఁ జేయఁ
దనయభేద్యగభీరతానారతఖ్యాతి
యంబోధి భంగపా టందఁజేయ
తే. నమర శీతాద్రిసేతుమధ్యావనీత
లాంతరనిరంతరయశోవిలాసభాస
మానభోసలతొళజరాణ్మణిసుతప్ర
తాపసింహేంద్రమౌలి ప్రతాపహేళి. 14

తే. ఆమహారాజుకృపఁ జెందినట్టినీకు
నిట్టిభాగ్యంబు లద్భుతం బేమి తెల్ప
సార మగునీదువిస్తారచర్య లెల్ల
వినుము వినుపింతు మని యిట్టులనిరి కరుణ. 15

సీ. శ్రీరమణీకుచశిఖరాగ్రముల నేవి
చిగురుజొంపంబులై జిగి చెలంగు
స్మరరిపుబ్రహ్మాదిమకుటంబులం దేవి
పద్మరాగంబులై ప్రభ లొసంగు
మౌనిరాణ్మానసమానసంబుల నేవి
కమలవనంబులై ఘన మెసంగుఁ
జిరతరశ్రుతివధూసీమంతముల నేవి
యరిదికుంకుమపట్టులై వెలుంగు