Jump to content

పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. చిన్నికృష్ణుండ నే నాదుచిత్తమునకు
సమ్మతంబైన రాధికాసాంత్వనంబు
తగ నొనర్పు మదీయాంకితముగ నీవు
లలితగుణపేటి శ్రీముద్దుపళనిబోటి. 11

వ. అని యానతిచ్చి యంతర్ధానుం డగుటయు నేను నిదుర మేల్కాంచి యీశుభస్వప్నం బెవ్వరితోడ విన్నవించెద నని యూహించి యుభయవేదాంతప్రతిష్ఠాపనాచార్యుండును, నిరుపమౌదార్యగాంభీర్యధుర్యుండును, బాషండషండగిరతండమహాఖండలుండును, బాలితభక్తమండలుండును, దిరుమలతాతాచార్యవర్యకులకలశపారావారతారాధారుండును, మదీయపూర్వజన్మతపఃఫలసారుండును, సుగుణాభిరాముండును నగు వీరరాఘవదేశికసార్వభౌమునిసన్నిధానంబున కరిగి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తత్కటాక్షంబునుం గాంచి యీశుభస్వప్నంబు విన్నవించినఁ దత్సన్నిధానంబునం గలసకలకళావల్లభు లగువిద్వజ్జనంబులు న న్నవలోకించి సాక్షాచ్ఛ్రీమన్నారాయణాపరావతారుం డగువీరరాఘవధీరుచరణారవిందంబు లాశ్రయించినదాన వగుటంజేసి దేవదేవుం డగుశ్రీకృష్ణదేవుండు సాక్షాత్కరించె దీన నీకు నధికశ్రేయఃప్రాప్తి యగు నదియునుం గాక. 12

సీ. ఏరాజు కువలయం బెల్ల రంజిలఁ జేసి
జైవాతృకాఖ్య నిచ్చలుఁ దలిర్చు
నేలోకబాంధవుం డిలఁ దమంబు లడంచి
చక్రప్రమోదంబు సంఘటించు
నేఘనుండు శరంబు లేవేళఁ గురియించి
పరవాహినుల నెల్ల భంగపఱచు
నేయీశుఁ డార్యావనాయత్తమతిఁ గాంచి
కీర్తింప సర్వజ్ఞమూర్తి యౌను
తే. వాఁడు నృపమాత్రుఁడే రఘూద్వహదయాప్ర
వాహవర్ధితభోసలాన్వయపయోధి