పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గఁ దగునాక్షేపజీవకవులఁ దీర్పఁ
జనదు కృతుల నమంగళజనులు వారు. 6

చ. చెలువుగఁ బూర్వసత్కవులు చేసినకబ్బము లెన్నొ యుండఁగాఁ
జెలిమిని నీకృతిన్ గణన సేతురె సత్కవు లందు రేమొకొ
భళి కయికొందు రె ట్లనిన బద్మపుఁదేనియ నానుతుమ్మెదల్
పులిసి హసించకే యితరపుష్పమరందము లోలిఁ గ్రోలవే. 7

వ. అని యిష్టదేవతానమస్కారంబును, గవిసత్కారంబును, గుకవితిరస్కారంబునుం గావించి యెద్దియేనియు నొక్క శృంగారప్రబంధంబు నిబంధింపం దలంచి హరివాసరంబునం శ్రీహరిం బ్రార్థించి మన్నిశాంతంబున నిదురింపుచున్న నన్నిశాంతంబున. 8

సీ. కటిఁ జుట్టి కట్టిన కనకాంబరముతోడ
మెఱుఁగుచామనిచాయమేనితోడ
నాసికతుదఁ గల్గు నవమౌక్తికముతోడ
జిగిలికస్తురిబొట్టుమొగముతోడఁ
గరుణారసముఁ జిల్కు కన్నుఁదమ్ములతోడ
నెమ్మిరెక్కతురాయినీటుతోడ
గుదికొని వెన్నాడు కుసుమపుంజముతోడఁ
జంద్రసూర్యాదిభూషాళితోడఁ
తే. బ్రతి యెఱుంగని దివ్యరూపంబుతోడ
సొగసు గనుపించు మవ్వంపుసొంపుతోడ
రాధికామణికైదండ రమణఁ బూని
చిన్నికృష్ణుండు కలను బ్రసన్నుఁ డయ్యె. 9

తే. ఇట్లు గనుపట్టునతని నే నెలమిఁ గాంచి
లేచి సాష్టాంగవందనం బాచరింప
శౌరి నను జూచి మేఘగంభీరరవము
దనరఁగా బల్కెఁ గరుణామృతంబు లొల్క.