పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

సాహిత్యమును గలదు. అందందుఁ దప్పు లున్నవి కాని యట్టి తప్పులు పురుషులకవిత్వమునందు సయిత మనేకగ్రంథములలో గానంబడుచున్నవి” అని శ్రీపంతులవారే యొప్పుకొనిరి. బాగుగా నాలోచించినచో శబ్దమునుబట్టియో అర్థమునుబట్టియో భావములనుబట్టియో రసమునుబట్టియో ఔచితినిబట్టియో యెటులయిన నేమి తప్పులేకుండ భారతము మొదలుగా నేగ్రంథమును లేదు. ఇట్లుండఁగా స్త్రీలు వ్రాసిన గ్రంథములలోఁ దప్పు లుండుట యొకతప్పు కాదు. “అయినను గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినఁదగినవియు, స్త్రీనోటినుండి రాఁదగినవియుఁ గాక దూష్యములై యున్నవి” అని శ్రీపంతులవారు వ్రాసిరేకాని తారాశశాంకవిజయము, హంసవింశతి, వైజయంతీవిలాసము మొదలగు గ్రంథములలోనివానికన్న నెక్కువగా నిందు దూష్యము లున్నవా! అదిగాక స్త్రీలు పురుషులవలన వినఁగూడక పోవచ్చును గాని తమలోఁ దాము చదువుకొనుటకు బాధక మే మున్నది? ఇంతకును నిది భగవచ్చరిత్రము, తారాశశాంకవిజయాదులవలె స్త్రీలకుఁ జెడుబుద్దులు గఱపువిషయ మేదియును నిందు లేదే. “ఇది జారత్వమే కులవృత్తిగాఁ గల వేశ్య యగుటచే స్త్రీజనస్వాభావిక మైనసిగ్గును విడిచి శృంగారరస మనుపేర సంభోగాదివర్ణనములను బుస్తకమునిండ మిక్కిలి పచ్చిగాఁ జేసినది” అని వ్రాసిరి. అగ్నిసాక్షికముగా నొకమగనిం గట్టుకొని రెండవమగనితోఁ బోవుట జారత్వ మనిపించుకొనును గాని వేశ్య జారిణి యనిపించుకోదు. బ్రహ్మసృష్టినాఁటినుండియు వచ్చుచున్న మాజాతికిఁ గులవృత్తి యెట్టిదో ఆసంగతియంతయు