Jump to content

పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126 రాధికాసాంత్వనము

సొగసుచూపులపాని మగరాలజిగి రాలఁ
దగునాల మొసఁగుదంతములవాని
నిడుదచేతులవాని నొడికంబునిడికంబు
నుడికంబు గొనుకంఠ మొనరువానికి
గలికిపేరెదవాని వలమబ్బు బలుపుబ్బు
వెలిద్రొబ్బువలపుమై సొలపువాని
తే. శ్రీకరాంగదకౌస్తుభశిఖిశిఖండ
మంజుమంజీరకర్ణికామణికిరీట
కనకపటహారచాకచక్యములవానిఁ
గృష్ణదేవునిఁ గని నవ్వి కీర మనియె. 30

క. గోపాలసామిగారా
కాపుర మేపురము చాలకాలమున కహో
మీపాదయుగము గంటిమి
చాపల్యము పేరె నున్న శాంతము దీరెన్. 31

క. అని పలుకుచిలుక నటు పో
గని కరమునఁ జేరఁ దీసి కనికర మొప్పం
గని కరము దువ్వి ముద్దిడి
చనపున హరి వలికెఁ గండచక్కెర లొలుకన్. 32

క. శుకవాగమృతాబ్ధీందుని
శుకవాహనజనకు నన్నుఁ జులకన సేయన్
శుకమా తగ దూరక మా
శుకవాణికిఁ దెలుపు కరుణఁ జూడు మటంచున్. 33

వ. అనిన విని శుకం బి ట్లనియె. 34

సీ. ననుఁ గాదు పొమ్మని నాతిఁ జేరినవాని
నే నెటు పిలుతు నో నెలతలార
నాపేరు నావగ నాతి కిచ్చినవాని
మో మెట్లు చూతు నో ముదితలార