పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పావనమయ్యె మద్గృహము పక్వములయ్యెఁ దపోవిశేషము
ల్వావిరివృద్ధిపొందెఁ జెలువంబగు కీర్తియుఁ బూని యర్ధిపై
నీవు మహానుభావుఁడవు నేఁ డరుదెంచుటఁ జేసి వేడ్కనో
భావజరూప! పూర్వకృతభాగ్యవశంబున మాకు నియ్యెడన్.


క.

గురులింగ మిమ్ముఁ గన్గొని | పరితోషము నొంది మది శుభస్థితిఁ దనరెం
బరమేశ్వరుఁ డిప్పుడు స | త్కరుణం బ్రత్యక్షమైనకైవడిమీరన్.


సీ.

ఎందుండి యిచటకు నేగుదెంచితి రిట్లు మునిచంద్ర! సౌందర్యమూర్తి దనర
నీమోవిపలుగంటు లీచెక్కుగవచీరు లీచిన్నివెన్నెల నెన్నునగవు
లీముద్దునునుబల్కు లీబిత్తరపుఁజూపు లీవలిపపుఁజెక్కు లీయొయార
మరయంగ మీకె భాసురలీలఁ దగునయ్య మఱియెందునైన నీమహిమ గలదె?
నాఁగ నాశంభుఁ డప్పు డానంద మొదవ | చేతు లొరజేసి నవ్వియుఁ జెలువు మెఱయ
నట్టివిటచిహ్న లేర్పడ నఖిలజనులు | వినఁగ నెఱజాణ యగుచు నిట్లనియెఁ బ్రీతి.


సీ.

జననిగర్భంబున జనియించినట్టి తత్ఫలమెల్లఁ దెల్పెద నలర వినుఁడు
జారుఁడై సతతంబు వారకాంతలతోడఁ గామకేళులయందుఁ బ్రేమఁ గూడి
కొమరొప్ప నింతులగుబ్బచన్నులమీఁద గరిమఁ జేయిడుకొని విరులశయ్యఁ
బవళించి సుఖలీలఁ దవిలియుండినఁ గాక కోరికలెల్లను గుదియఁబట్టి
కలలఁ దరుణులఁ గామించి కలితుఁ డగుచుఁ | బెరిగి పంచేంద్రియంబులు బిగ్గఁబట్టి
తియ్యవిల్కానిబారికి నొయ్యనొరిగి | తిరుగుచుండిన ఫల మేమి సిరుల కరయ?


క.

మానినులఁ దవిలియున్నను | మానుగ నిహపరము లొదవు మనుజుల కెల్లన్
కానలభూములఁ దిరుగుచుఁ | దానములు జపంబు లేల తగ నొనరింపన్?


సీ.

సరవి ముత్త్రోవద్రిమ్మరిఁ దలనిడుకొన్న కరిదైత్యమధనుండు కామి గాఁడె?
కొమరొప్ప మోహించి కూఁతు నిల్లాలిఁగఁ గైకొన్నపరమేష్టి కామి గాఁడె?
కూర్మిఁ బదార్వేలగొల్లపూఁబోణులఁ గలసిన వెన్నుండు కామి గాఁడె?
గౌతమమునిపత్నిఁ గడఁగి వరించిన గట్టులపగవాఁడు కామి గాఁడె?
కోరి యాచార్యుభామినిఁ గూడినట్టి | కైరవాప్తుండు మిక్కిలి కామి గాఁడె?
కామి గాకున్నట్టి యస్ఖలితుఁ డెవఁడు | కామి గాఁడేని నిర్వాణకామి యగునె?


గీ.

అదియునుంగాక కామశాస్త్రాళియందుఁ గామి గావచ్చునని పల్కుకతన నిట్లు
తనర విటజంగమాకృతిఁ దాల్చి యేను | నలర వెలయాండ్ర భక్తుల నడిగికొనుచు.