పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

భోగింతు నెల్లవేళల | బాగొప్పెడు కామశాస్త్రపద్ధతి వెలయన్
శ్రీ గల్గుట కరయఁగ ఫల | మీగతి సుఖియింపవలదె యింపలరారన్.


చ.

రమణికుచద్వయం బొగి నురమ్మున నానుక మోము మోముపైఁ
బ్రమదము మీరఁ జేర్చుకొని పల్మరు కోర్కెలఁ బుష్పశయ్యపై
నమరఁగఁ బవ్వళించి యనయంబును మన్మథసౌఖ్యలీలలన్
గ్రమమున నోలలాడుటయె గాదె సుజన్మఫలంబు ధారుణిన్.


క.

అని సెలవులఁ బాఱఁగఁ జ | య్యన నవ్వుచుఁ బల్కు జంగమాధిపు నొరయం
జనదనుచు నృపుఁడు లింగా | ర్చన సేయఁగఁ బిలువ నతఁడు క్రమ్మఱఁ బలికెన్.


సీ.

జననాథ! మారాక చందమంతయు నీకు విను మెఱిఁగింతు సవిస్తరముగ
నన్నంబుపై నించుకైనఁ గోరిక లేదు వలనైన వెలఁది గావలయుఁ జుమ్ము
వేశ్య లేనిదినాలు వేయైనఁ గాని భోజన మొనరింపను సైపకుండుఁ
గావున వేవేగఁ గన్నులపండువ యగుదాని నొక్కతెఁ దగినభక్తి
తోడఁ దెప్పింపు వేడుకతోడ నిపుడు | గౌరవంబుగ నీ విచ్చుకట్న మిదియె
యనుఁడు నృపశేఖరుఁడు నేర్పు దనర నతనిఁ | గాంచి యిట్లను సద్వచోగరిమ మీర.


విను గురునాథ! నిక్కమగువిన్నప మొక్కటి చిత్తగించి యి
ట్లనుచితము ల్వచింపఁగ మహాత్ములకున్ దగదయ్య మిమ్ము ని
ప్పని విని యెవ్వరైన నగుబా టొనరించెదరయ్య మీ రెఱుం
గని దిపు డెద్ది యిమ్మహిని కార్యము లేదు గదయ్య తెల్పఁగన్.


చ.

అడుగు మఱెద్దియేనియు రయంబ యొసంగెదఁ గాక మీకు ని
ప్పుడు నొకకన్నియం దెలిసి పొందుగఁ బెండ్లి యొనర్చి రత్నపుం
దొడవులు జీరలుం బసులతో ధనధాన్యములున్ గృహంబులున్
గడువడి భృత్యవర్గమును గైకొను మిచ్చెదఁ గోర్కె మీరఁగన్.


క.

ఊరూరుఁ దప్పకుండఁగ మేరలు | సేయింతు నిపుడు మీశిష్యులకు
న్వారంబు లొసఁగు నట్ల ను | దారత వర్షాశనములు తగ నొనరింతున్.


గీ.

పెండ్లికట్నంబులును గడుఁబేర్మితోడ | రాగికప్పెరలును మీకుఁ బ్రాకటముగ
నియ్యఁజేసెదఁ బ్రజలచే నెల్లతఱిని | సూనశరరూప! యట్లు గాదేని వినుము.


శా.

గ్రామంబు ల్కరు లందలంబులు శతాంగంబు ల్తురంగంబులు
న్భూమిం బేరగువస్తుసంఘములు సంపూర్ణంబుగా నిప్పుడే