పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రాజశేఖరచరిత్రము


గామధేనువు వానింటి గాడి పసర
మల్లసురశాఖి వానింటి మల్లెచెట్టు.

65


సీ.

నవరత్నమయభూషణములు దాల్చినవారు
                       సింహాసనస్థులై చెలగువారు
పరతత్వవాసనాపరత గాంచినవారు
                       నిఖిలవిద్యాప్రౌఢి నెరయువారు
చిరకాలజీవులై క్షేమమొందెడువారు
                       వితరణ విఖ్యాతి వెలయువారు
బంధుమిత్రస్ఫూర్తిఁ బాయకుండెడువారు
                       బహుపుత్త్రలాభంబుఁ బడయువారు


గీ.

చక్కదనమున వన్నెకు నెక్కువారు
తొంటి మేనుల సద్భక్తి తొంగలింప
కాశికానాథుఁ గామారిఁ గాలకంఠు
పూజ చేసినవారెపో పువ్వుబోఁడి.

66


సీ.

కడలేని సంసారజడధిలో మునిఁగిన
                       జనులపాలిటి నావ శంభుసేవ
కడుదూరమైయున్న కైవల్యసీమకుఁ
                       జక్కని పెనుద్రోవ శంభుసేవ
యతిభోగభాగ్యంబు లనుముత్తియంబుల
                       సరులఁగూర్చిన కోవ శంభుసేవ
సకలాగమజ్ఞానసారమహీజాత
                       జాతంబులో చేవ శంభుసేవ


గీ.

నిరవధిక్రూరపాతకదురవగాహ
గహనదహనసమున్నిద్రగంధవాహ
సఖశిఖామాలికలఠేవ శంభుసేవ
(సద్గుణలతాంతముల తీవ శంభుసేవ.)

67