పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము నందలి,

సీ. అఖిలసీమామూలమై దుర్గమ్ము లు
                         మ్మకలు గల కమ్మ వెలమదొరలు
     చేతి కైదేసివేల్ శివరాయల వరాల
                         నెల కట్టడల పటాణీ ల్గరీబు
     లూళ్ళాయములమీద హొరపుత్తరవు గన్న
                         రాయకై జీతంపు రాయవారు
     పగటిగ్రాసంబు దప్పకయుండ దినరోజు
                         మాదిరి నొంటిరు జోదుమూక
గీ. మొదలుగా గల బారలు మొనకు నిల్చి
     పొడిచి పేర్వాడి వీథు లేర్పడగ జేసి
     గాసి గావించి యరుల జేనాసి యెదుట
     జూపి నిలఱేడు మూడు మెచ్చులున మెచ్చ.

అను పద్య మందలి "శివరాయల వరాల"నుటచేత శివదేవరాయలనాటివాడు గాని, తరువాతివాడనిగాని నిశ్చయించుట కాధార మీగ్రంథమందే లభించినది.

అచ్యుతదేవరాయల కుమారుడు మరణించిన తరువాత రంగారాయల కొడుకు సదాశివరాయలు రాజ్యమునకు వచ్చెను. సదాశివదేవరాయల బావమరిది యకు రామరా జతని కమాత్యుఁడై యుండెను. తాళికోట యుద్ధములో 1565 లో రామరాజు మరణించెను. సేనాని వెంకటాద్రియు మడసెను. ఇక మిగిలినది నేనాని తిరుమలరావు ఒక్కడే. అతడు 150 కోట్ల రూపాయిలు, నవరత్నాభరణములు మొదలగు బహుధనముతో సదాశివరాయలను తోడ్కొని అనంతపురము వద్దనున్న పెనుకొండ దుర్గమునకు పారిపోయెను.

1568 వ సం॥మున సదాశివరాయలను చంపి తిరుమలరాయుడే రాజ్య మేలెను. కానీ అక్కడ నిలువలేక చంద్రగిరికి వచ్చి చేరెను.

ఈ కవి 1568 సం॥ తరువాత సదాశివదేవరాయల వరాలు ప్రచారములో నుండుకాలమున జీవించియుండెనని నిర్ధారణ చేయవచ్చును.