పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజవాహనవిజయము

పీఠిక

ఇది 5 ఆశ్వాసముల ప్రబంధము. కాకమాని మూర్తికవి ప్రణీతము. ఈతడు బ్రాహ్మణుడు. ఇంటిపేరు పెన్నేకులవారు. తండ్రి రామలింగభట్టు. తల్లి తిమ్మమాంబిక. ముత్తాత రామపండితుడు. తాత ప్రబోధపండితుడు. ఆపస్తంబసూత్రుడు. ఉభయభాషావిద్వత్కవీంద్రుడు. కవి పట్టభద్రుడు.

ఈతడు సంకుసాల నృసింహకవివలె

శా. వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞ సతతైకాంతుల్ మహాచేటికా
     శ్రీలోపద్రవ నవ్యపత్రికులు భూరిప్రాజ్ఞవిజ్ఞాపనా
     వేళాకల్పితరక్తవక్త్రులు కళావిజ్ఞాననిర్భాగ్యు లీ
     కాళక్ష్మాతలనేతలం బొగడుటల్ కష్టంబు లర్థార్థికిన్.

అని ఆనాటి రాజులను గూర్చిన తన యభిప్రాయమును వెల్లడించుచు 'నదైవం కేశవాత్పరమ్మ'ని తనకృతులలో పాంచాలీపరిణయమును శ్రీరంగపతికిని, రాజవాహనవిజయమును శ్రీ వేంకటాచలపతికిని గృతి యొసంగెను. ఈతడు రచించిన బహుళాశ్వచరిత్రములోని లక్ష్యములుగా జూపబడిన పద్యములు తక్క, సమగ్రగ్రంథ మెచ్చటను లభింపలేదు.

కవికాలము

సాధారణముగా కవికాలమును నిర్ణయించుటకు కవిస్తుతియు, గద్యలు, నరాంకిత మొనర్చియుండిన యెడల నాకృతిపతి వంశకథనమును జాలవఱ కుపచరించెడివి. ఈతడు సంస్కృతకవులను, కవిత్రయమునే పేర్కొనియెను గాని, తననాటి కవులను పేర్కొశక తన తాత ముత్తాతలను పేర్కొనెను.