పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శ్రీరాజగోపాలవిలాసము


సీ.

నవనవోల్లేఖననవనయోగ్యము గాని
                 పద్యంబు జనులకు హృద్యమగునె?
ఘనతరాలంకారకారణంబులు గాని
                 వాక్యవైఖరుల నెవ్వారు వినరు
శేషభాషితవాగ్విశేషాన్వితము గాని
                 పదము విద్వత్ప్రేమపదము గాదు
ఘనసారసారంబు గాని సందర్భంబు
                 లర్భకులైనను నాదరింప


గీ.

రంచు వివరించు చలచామరాంచదనిల
చలితచేలాంచలాగ్రహస్తంబుచేత
విజయరాఘవ మేదినీవిభుని సభను
తనదు మహిమంబుచే శారదాధ్వజంబు.

19

కైవారము

మ.

కలమంద్రోదితరత్నకంకణఝణత్కారంబు తోరంబుగాఁ
దలిరుందీవెలు చంచలించుగతి హస్తన్యాసముల్ మీఱఁగా
లలనల్ ‘పాండ్యనృపాలమండలవిభాళా!” యంచుఁ గైవారముల్
వలనొప్పన్ రచియించి రంత నుచితవ్యాపారపారీణతన్.

20

సభానాట్యవర్ణన

గీ

భరతసంగీతసాహితీప్రముఖవిద్య
లాకృతులు గన్నచందాన నబ్జముఖులు
సరసముక్తాతపత్రచామరము లలర
వివిధబిరుదాంకవాద్యముల్ వెలయనిల్వ.

21