పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

119


గీ.

వినుతి గావించి శాస్త్రోక్తవిధిని యందు
మజ్జనం బాడి యాస్నానమహిమవలన
వీతకల్మషుఁడై భక్తి వెలయ నాత్మ
నాత్మముఖల నెల్ల దా నధికనిష్ఠ.

59


క.

మనుజేంద్రుఁడు పదియాఱగు
ఘనదానము లొసఁగి విష్ణుకైంకర్యము దా
నొనరించు మిగులధనముల
వినతులు గావించి భక్తివినుతులు సేసెన్.

60


గీ.

కోటిమణు లిచ్చి యారాజగోపమణికి
పంచపాత్రము లర్పించి భక్తి మించి
భక్తిశేఖరుఁడైన యాపార్థివుండు
తదనుమతి నేఁగె నిజరాజధాని కపుడు.

61


క.

ఈకథ వినినం జదివిన
లోకోత్తరమహిమ భక్తలోకము కెల్లన్
శ్రీకాంతునికృపవల్లను
చేకురు నారోగ్యభాగ్యచిరతరసుఖముల్.

62


క.

అష్టాక్షరీజపం బురు
శిష్టతఁ గావించు పుణ్యశీలురకు మనో
భీష్టార్థఫలము లన్నియు
ముష్టిగ్రాహ్యంబు లగుచు ముందటనిల్చున్.

63


గీ.

ద్వాదశాక్షరియనెడు మంత్రంబు భక్తి
జపముఁ గావించునట్టి సజ్జనుల కెల్ల
రాజగోపాలుఁ డురుదయ రాజిలంగఁ
గొంగుబంగార మగుచుఁ జేకూర్చు శుభము.

64

.