పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

97


మ.

కరముల్ సాఁపుచు చూపి చెప్పఁగ మరుత్కాంతల్ జయంతాదులౌ
నరుదుల్ చూచితిమంచు మెచ్చి మదిలో హర్షింప వైడూర్యముల్
తెఱలెత్తన్ మణిదీపముల్ చెలఁగ హాళిన్ జాళువామేడలన్
సొరిదిం గన్నెమెఱుంగు గుంపులు నటించున్ మెచ్చుగా నచ్చటన్.

55


శా.

తారామార్గము మీఱు సౌధగృహసంతానంబుపై బంగరుం
రారేకల్ నవనూనసౌరభములన్ రాణింప పొందమ్ములన్
బేరాసన్ సురసింధుపద్మములలో భృంగాళి యే తెంచి ఝం
కారంబుల్ సవరించుఁ దన్మహిమకుం గైవారముల్ నాతగన్.

56


మ.

తళుకుంగెంపులయండ నీలనికరథ్వాంతంబున గోకముల్
కలయంగా గమకించి పాయుటకునై కాంతామణుల్ నవ్వ నా
జిలుగున్ వెన్నెలఁ జంద్రకాంతవళభీసీమల్ పయోధారలం
దలకొల్పంగఁ దదగ్రగేహ మమరున్ ధారాగృహంబో యనన్.

57


మ.

వలువల్ కోరినయట్లు కల్పలతికావ్రాతం బొసంగన్ మరు
జలజాతుల్ గయికోఁదలంచునెడ నాసౌధాగ్రహీరప్రభల్
వలువల్ నాఁగఁ దదంతరాళములఁ బర్వన్ వాటిఁబూనంగ చే
తులు సాఁపం గని గొల్లున న్నగుదు రింతుల్ తద్గవాక్షమ్ములన్.

58


మ.

రమణుం డందరు వేరువేరను శరద్రాకాశశాంకాస్యలం
గ్రమముల్ మీఱఁగ నేలువైఖరులఁ దత్కాంతాశిరోరత్నముల్
సమరాగంబున వానికిన్ వలచు నాసయ్యాటపుంనేర్పులం
దమి పుట్టించు నిలింపదంపతులకుం దచ్చిత్రలేఖాంకముల్.

59