పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

89


గీ.

అనుచుఁ బలికెడువేళ నయ్యంబుజాక్షు
మేని జవ్వాదిపస కదంబించ దిశల
నాయకునిరాక యరయఁగఁ బోయివచ్చు
ననుఁగునెచ్చెలి వల్కె నయ్యతివతోడ.

18


ఉ.

హెచ్చెను దిగ్విభాగముల నెల్లెడ మేని జవాదివాసనల్
వచ్చెను నాథుఁ డీనగరివాకిటికి న్నెఱరాజసంబుతో
మెచ్చవె యింకనైన మెరమెచ్చుల సుద్దులు వల్క నెన్నడున్
పచ్చనవింటివేల్పునకు భామిని! జాతర సేయు మింకిటన్.

19


గీ.

అనుచుఁ బలికెడువేళ కంసాసురారి
మందహాసంబు చెక్కులఁ గందళింప
వలిపె వలిదుప్పటీవల్లెవాటుతోడ
మెల్లమెల్లనె చెలియున్న మేడఁ జేరి.

20


మ.

కలవీణారణనాంకకంకణగణక్వాణంబు రాణింపగా
కులుకుంజన్నుల సాలుపైయ్యెదల కొంగుల్ జాఱు నొయ్యారముల్
మొలవంజూచు మిటారిచూపులను సొంపుల్ నింపుచున్ గుంపులై
కలకంఠుల్ రతనంపుటారతు లొసంగం జూచి యుప్పొంగుచున్.

21


గీ.

రాజసము మీఱ గక్షాంతరములు గడచి
విరహకాతరయై యున్న వెలఁదిఁ జూచి
చిలికిచూపుల వలపులు చిగురులొత్తఁ
బలికెఁ బలుకులఁ గపురంపుఁబలుకు లొలుక.

22