పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

75


సీ.

కుటిలకుంతల! నీదుకురులు చిక్కులఁ బడ్డ
                 దాఁటులు వేయదె తేఁటిదాటు
కాంత! నీయూరుపు లింత వేఁడిమి గన్న
                 నామోదిగాదె మందానిలంబు
పడఁతి! నీవెన్నంటు జడను గాంచినఁ జూచి
                 కేకలు వేయవే కేకులెల్ల
నింతి! నీనెమ్మొగ మించుక వాడిన
                 చాల మిన్నందదే చంద్రబింబ


గీ.

మలుకవూనంగ నీ విప్పు డంబుజాక్షి!
విన్ననై యున్నవిట్టి నీవేళ చూచి
గెలువ దమకించు నివియెల్లఁ గేలి సేసి
పగలు నీఁగుట యొక్కక్కపట్లఁ గాదె!

51


గీ.

అనుచుఁ దా పల్కుపల్కుల కాత్మలోని
కలఁకఁ దేఱిన చూపులఁ గమలనయన
యించుకించుక తనుఁ జూచు టెఱిఁగి విభుఁడు
నిండువేడుకతోడ నానెలఁత నంత.

52


ఉ.

చక్కనిసిబ్బెపుంగులుకు జక్కవగుబ్బలనుబ్బు మీఱఁగా
నక్కున నొక్కి చొక్కి దరహాసము మోమున నంకురింప వేఁ
జెక్కునఁ జెక్కు చేర్చి రతిచిన్నెల వన్నెల వాఁడిగోరులన్
నెక్కొన గ్రక్కునన్ గళల నెన్నెలవుల్ గరఁగించ కాంతయున్.

53


శా.

సంభోగశ్రమబిందువుల్ ముఖవిధుస్వచ్ఛామృతస్యందమై
సంభావింపఁగ లోచనాబ్జములపజ్జన్ బెన్నెఱుల్ గుంపులై
యంభోజమ్ముల వ్రాలు తుమ్మెదల యెయ్యారంబు చాటింపఁగా
పుంభావంబున నాథుఁ దేల్చె పులకల్ పుంఖానుపుంఖంబుగన్.

54