పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

69


సీ.

పాన్పుపైఁ గూర్చుండి బాగా లొసంగుచో
                 చేసోఁకుటకుఁ గొంత చిత్తగింప
తనుఁజూచి మాటాడ ధవుఁడుఁ బ్రార్థింపంగ
                 మాటలాడంగ నెమ్మదిఁ దలంచి
సకినల బటువులు సరసకు దివియంగ
                 మొలచిన జిలిబిలి ముద్దుబలుకు
రవళికం గెరలు పారావతమ్ముల మించు
                 కలరవమ్ముల మాటుగా నొకింత


గీ.

తెలిసి తెలియదటన్న సందేహ మలర
చిగురుకెమ్మోవి ననలొత్త చిన్నినగవు
బెళకుచూపుల రాగంబు పెనగొనంగఁ
బ్రమద పలికినపలుకులఁ బ్రమదమందె.

24


మ.

కలయం బర్విన చూపుతూపు లెలగో ల్గావించి వేమించి య
య్యలినీలాలకయున్ విభుండు తమి బాహాబాహిఁ బోరాడఁగా
వల రాయండు ప్రసూనవర్షములఠేవల్ చూపినట్లయ్యె న
య్యలరుంబోడికి కొప్పువీడివడి క్రిందై క్రొవ్విరుల్ చిందఁగన్.

25


గీ.

చూపుచూపును సరివోవఁ జూచి యపుడు
హృదయములు రెండు సరియౌట నెఱుఁగ వేఁడి
గాఢపరిరంభసంభ్రమకైతవమున
బాయకుండిరి వేడ్కతోఁ బతియు సతియు.

26


క.

రతి చాటువులను నిర్జిత
రతియగు సతి మనము గరంచి రాగము మీఱన్
రతులం దేలిచె యాహరి
యతులితసమ్మోదగర్భితాశయుఁ డగుచున్.

27