పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శ్రీరాజగోపాలవిలాసము


ఉ.

ఎంతతపంబు చేసితివొ! యెంతటివేలుపు భక్తి గొల్చితో
యెంతవ్రతంబు సల్పితివొ? యెంతటిభాగ్యము సంతరించితో?
యెంతటినోము నోచితివొ! యెంతటిదానము నాచరించితో
యంతటివాఁడు నీకుఁ బతి యౌటకు నంబుజపత్రలోచనా!

18


చ.

కలకలు మీకు నెన్నటికి గల్గునొ యంచుఁ దలంచి నేర్పుగా
నలుకలు పుట్టఁజేయుచుఁ బ్రియంబులు వల్కినయట్టి పిమ్మటన్
వలపులు కొన్నికొన్ని కొనవైచి మిముం జత గూర్చునట్టి యా
కలికి పిసాళి జంతలము గాముగదే! గజరాజగామినీ!

19


క.

అని పలుకు దూతి పలుకుల
మనమునఁగల కోపభరము మట్టుపడంగా
తనరాకలు మదిఁగోరెడు
వనజానన హృదయ మెఱిఁగి వల్లభుఁ డంతన్.

20


శా.

ప్రోడల్ చూచి సజీవచిత్రముల సొంపుల్ మించ నౌనౌ ననన్
నీడల్ దేఱెడు నిల్వుటద్దముల వన్నెల్ మీఱు జాబిల్లిరా
గోడల్ కాంతల బింబసంపదల దిక్కుల్ నింప లేఁగెంపురా
మేడం జేరెను జాళువావలువ క్రొమ్మించుల్ దువాళించఁగన్.

21


ఉ.

అందు విలాసరేఖ యిటులాకృతిచే రహి గాంచెనో యనం
గుందనపుంబసిండితళుకుల్ వెదజల్లుచు క్రొమ్మెఱుంగె యీ
యందమునందెనా నలరు నంగన చెంగట వచ్చినిల్చినన్
గందళితానురాగరసకందళమానసుఁడై ముదంబునన్.

22


గీ.

లేమ కెంగేలు కేలఁ గీలించి పట్టి
సరసనున్నట్టి విరవాది చప్పరంబు
చవికెలోపలి పసిఁడిమంచంబునందు
విరులునించిన శయ్యపై వెలఁది నుంచి.

23