పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

51


రమ్ము నీగుబ్బచన్ను లురమ్ముఁ జేర్పు
నానపూనిన వలరాజు నాన నీకు.

31


క.

అని యనురాగము మీఱఁగ
వనజాక్షుఁడు సరసవాక్యవైఖరిఁ గేళీ
వనకుంజపరిసరంబున
సనునయ మొనరింపుచున్న యంతటిలోనన్.

32


సీ.

కర్నాటకపుతీరు గలనిక్కుకొప్పున
                 సవదరించిన సన్నజాదిసరుల
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్నులమీఁద
                 నసియాడు ముత్తేలహారములను
రవిక పూనినయట్టి రహివహింపఁగ మేనఁ
                 దనరారు చల్వగందంపుఁబూఁత
నుదుటు లేజాబిల్లి యొరపొందు నుదుటను
                 దీర్చిన కపురంపుఁదిలకమునను


గీ.

మొలచి చిగురించి యంతట మొనయనల్లి
పూచు వెలినిగ్గుతీవెలప్రోది గన్న
పండువెన్నెలతేటలు పైఁజెలంగు
మేలి తెలిసాలియ ముసుంగు మించునించ.

33


ఉ.

వెన్నెలతేటయో? చెఱకువిల్తుని గెల్పులపువ్వుఁగోలయో?
కన్నులఁ గానుపించు త్రిజగన్నుతమోహనమంత్రవిద్యయో?
మన్ననఁగన్న యన్నలువ మానససృష్టియొ? యంచు నెంచగా
గన్నియ ముద్దునెన్నడలఁ గౌ నసియాడఁగ నిల్చె నయ్యెడన్.

34