పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజగోపాలవిలాసము

45


మ.

తళుకున్నిద్దఁపుఁదారవజ్రములచేతన్ మించు పైయంచులన్
వలగోఁ జెక్కిన కెంపురాపలకమిన్నల్ జాజుపట్టెల్ వలెన్
వెలయంగా వెలలేనిరత్నముల నెంతే వింతయౌ తిన్నెపై
కలకంఠీమణి దూతిరాక మది నాకాంక్షించి కూర్చుండఁగన్.

4


గీ.

ఎల్లగరితలు తనజాడ లెఱుఁగకుండ
జారభావంబు మదిఁగోరు శౌరికడకు
భద్రచెంతకు నంపిన ప్రౌఢదూతి
నెమ్మి మీఱంగ వచ్చి వినీతితోడ.

5


మ.

తొగరారాతెగమేడయోవరుల జోతుల్ తేటనిద్దంపులేఁ
జిగురు న్వెన్నెలచల్వచప్పరమునన్ చిన్నారిపూగుత్తులన్
నెగడం జేయఁగ బాటనుండి వలిదేనెల్ చిందు చందంబునన్
చిగురుంబోడి మురారిఁ జేరి పలికెన్ జిత్తంబు రా నత్తరిన్.

6


గీ.

స్వామి! యెంచినకార్యంబు సఫలమయ్యె
నెచట సంకేతమో యానతీయవలయు
ననుచుఁ బలికిన శౌరియు ననుచు వేడ్క
నల శుకాలాపతోడ నిట్లనియె నపుడు.

7


చ.

కలికిరొ! నీవు వచ్చుదనకన్ సురపొన్నలపజ్జ గొజ్జగుల్
వలగొను తేటమంచు తెలివాఁకలచెంతల మావిమోకలన్
మలకలుగాఁగ నల్లికొను మాధవికాలతికల్ మరందముల్
చిలికెడు పువ్వుచప్పరము చెంగటి యాపొదరింట నుండెదన్.

8


క.

అని గుఱుతుగ సంకేతము
వనజాక్షికిఁ దెలిపి పోయివచ్చెదవా? నీ
వని యనిచిన నవ్వనితయుఁ
జనియెం జెలియున్న కేళిసౌధముకడకున్.

9