పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శ్రీరాజగోపాలవిలాసము


గీ.

చెలులు గనకుండ నేర్పున చెలువవిభునిఁ
జిత్రపటమునఁ గస్తూరిచేత వ్రాసి
గబ్బిగుబ్బలతుదలు సోఁకంగఁ జేర్చి
పలికె నిట్లని తనయభిప్రాయమెల్ల.

98


మ.

'కలలోనైనను నీదు మాటలకు నౌఁగాదంచు మాఱాడుటల్
గలవో? వాడల వాడలం దిరిగి రాఁగా నీకు మెండొడ్డుటల్
గలవో? చూచినవార లందఱు నగంగా నిన్ని విన్నాణముల్
గలవో? మానవతీవిలాసమకరాంకా! యింక నేమందురా?

99


చ.

గఱిగఱి నంట తుంటవిలుకానిశరంబులు నాయురంబునన్
జుఱఁజుఱగాడ నీవు దయఁజూడక యుండుట లిప్పు డక్కటా!
చెఱుకునఁ బండు పండిన భుజింపఁ దలంపమి గాక ప్రాయపుం
దెఱలతోడ దాన్ని తరితీపులు చేసినవారిఁ గంటిమే?

100


చ.

వలఁగొను చింతతోడ నెలవంకఁ గనుంగొని యేఁ దలంకఁగాఁ
గలఁగకు మంచు మున్న బిగిఁగౌఁగిటఁ జేర్పుదు విప్పు డక్కటా!
కులుకుమెఱుంగుగబ్బివలిగుబ్బలపై నెలవంక లుంచి యేఁ
దలఁకుచు నుండ నీవు దయఁదప్పిన నేగతిఁ దాళనేర్తురా?

101


సీ.

ఏలాగు విహరింతు లీలాసరఃప్రాంత
                 కాంతనిశాకాంతకాంతసరణి?
నేలాగు సైరింతు నేలాతిసౌరభ
                 భ్రమజాతివిభ్రమభ్రమరగీతి?
నేలాగు వసియింతు నీలాశ్మకృతవేశ్మ
                                  జాలశీతలమరుజ్జాలకముల?
నేలాగు చెవిఁ జేర్తు లోలామ్రదళవలత్
                 కలకంఠకులకంఠకలరవంబు?