పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శ్రీరాజగోపాలవిలాసము


పాళీవాసితసాంద్రచంద్రకదళీప్రాంతేందుకాంతస్థలిన్
లీలానిర్జితమన్మథుం డతఁడు హాళిం బెక్కుచందంబులన్.

90


గీ.

తమకమున నింతులెల్లను తమకతమకె
వలచెనని యెంచ నానందవార్థిఁ దేల్చి
యష్టవిధనాయికలలీల లలరఁగోరి
యష్టమహిషుల నలజాడ కనువుపఱచె.

91

స్వీయ రుక్మిణి

సీ.

మలయానిలమ్ములు మలయ ఘుమ్మన గ్రమ్ము
                 తావుల మావుల తావులందు,
పరిణతఫలగుచ్ఛపరిరక్షితంబులై
                 పఱపైన ద్రాక్షచప్పరమునందు
మగరాల నిగరాల మగఁటిమి గనుపించు
                 సరసిజాకరతీరసరణులందు
పొదలెడు గొజ్జంగిపొదరిండ్లపజ్జల
                 చలువరేరారాచచలువలందు


గీ.

నొకరి కొకరికిఁ దెలియక యుండునట్లు
చతుర లైనట్టి యల జలజాతముఖులు
సఖులతోఁ గూడి సరసప్రసంగలీలఁ
గోరికలు నిండఁ దనరాక గోరుచుండ.

92


ఉ.

ఒక్కొకదూతితోడ వినయోక్తులఁ గార్యము కూడునట్లుగా
నొక్కొకదూతితోడ సరసోక్తులఁ గోపముఁ దీరునట్లుగా
నొక్కొకదూతితోడ మధురోక్తుల మర్మము మీఱునట్లుగా
మక్కువతోడ నా యువతి మన్మథ మన్మథుఁ డన్నిరీతులన్.

93