పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శ్రీరాజగోపాలవిలాసము


సీ.

చేరికొల్చినఁ గల్గు తారహారావళు
                 లనుమాట నిజమె పాండ్యక్షితీంద్ర!
కని కొల్చినను గల్గు కనకకోటీరంబు
                 లనుమాట నిజమె మద్రాధినాథ!
భక్తిఁ గొల్చిన గల్గు బాహుకేయూరంబు
                 లనుమాట నిజమె కొంగావనీశ!
నమ్మి గొల్చినఁ గల్గు నవరత్నకంబులు
                 ననుమాట నిజమె యాంధ్రాధినాథ!


గీ.

అనుచు మును మంత్రు లనుమాట లనువదింతు
రనుదినంబును శింజితవ్యాజమునను
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
గండపెండెంపుబొమ్మలై యుండుదొరలు.

77


సీ.

అందె సింగారించ నందిచ్చు నెపమున
                 ధవునిఁ గన్గొనియె మాళవవధూటి
కీలు పొందిక సేసి కీలించు నెపమున
                 భర్తఁ గన్గొనియె నేపాలబాల
పాదపీఠము నిల్పు పనినెపంబునఁ జేరి
                 మగనిఁ గన్గొనియెను మగధకాంత
చరణాంబురుహసేవ సవరించు నెపమున
                 విభుని గన్గొనియె సౌవీరతరుణి


గీ.

ఇట్లు కనుగొని యరికాంత లెలమిఁ జెంది
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
బిరుదుపెండెంపుబొమ్మకా ప్రియులఁ గాంచి
వగతు రాత్మల నిట్టూర్పు నిగుడనీక.

78