Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విలాససంపదను, తలంపదు = ఎన్నదు - పెదవేంకటాద్రిలీలలను గన్నది కాన సర్పక్రీడను మెచ్చనిదయ్యె ననుట, ఆశేష = సమస్తములైన, భోగ = సుఖానుభవములయొక్క, లీలాకలనంబుచేతన్ = విలాసక్రియచేత, శేష = కొద్దియయిన - భోగములకల్మిని తలంపదని యర్థాంతరము, మఱి = ఇంక, కరులన్ = అష్టదిగ్గజములను, గిరులన్ = సప్తకులపర్వతములను, చెప్ప నేటికిన్ = వాకొన నేల. కేవలభగవదంశసంభూతము లైనవరాహాదిశేషులే యిటు లైనచో నితరములఁ జెప్ప నేల యని తాత్పర్యము.

తే.

ఈకరణి ధాత్రి వెలసినయాకువీటి
తిమ్మరాహుత్తతనయుఁ డుత్తీర్ణకీర్తి
పరుఁడు పెదవేంకటాద్రిభూవరుఁడు సేయు
సేవ లింపుగఁ గైకొని దైవమునకు.

40

టీక. ఈకరణిన్ = ఈవిధమున, ధాత్రిన్ = భూమియందు, వెలసిన = ఒప్పిన, ఆకువీటి = ఆకువీటిపురాధ్యక్షుఁడైన, తిమ్మరాహుత = తిమ్మరాజాగ్రణియొక్క, తనయుఁడు = కొమరుఁడైన, ఉత్తీర్ణ = లోకము నతిక్రమించిన, కీర్తి = యశమునందు, పరుఁడు = సక్తుఁ డైన, పెదవేంకటాద్రిభూవరుఁడు = పెదవేంకటాద్రిరాజు, చేయు = ఒనర్చునట్టి, సేవలు = వందనములు, ఇంపుగన్ = ఇష్టముగ, కైకొని= గ్రహించి, దైవమునకు = నాయిష్టదేవతకు.

క.

లోకైకస్తుత్యునకు ని
రాకృతనతజనజనుర్జరామృత్యునకున్
ద్రైకాల్యసత్యునకుఁ బా
ణౌకృతగిరిరాడపత్యునకు నిత్యునకున్.

41

టీక. లోక = జనులచేత, ఏక = ముఖ్యముగ, స్తుత్యునకు = స్తోత్రము చేయఁదగినవానికి, నిరాకృత = పోఁగొట్టఁబడిన - ఇది జనురాదిశబ్దమునకు విశేషణము, నతజన = అభివాదకులయొక్క, జనుర్జరామృత్యునకు = పుట్టువుముదిమిచావులు గలవానికి, త్రైకాల్య = భూతభవిష్యద్వర్తమానకాలముల మూఁటను, సత్యునకున్ = నిత్యుఁ డయినవానికి, పాణౌకృత = పెండ్లాడఁబడిన, గిరిరాడపత్యునకున్ = పార్వతి గలవానికి.

క.

అధ్యాత్మతత్త్వవిద్యా
సాధ్యునకు సమస్తయోగిజనహృత్కమలా
రాధ్యునకుఁ గాలదిగనవ
రోధ్యున కధ్యుషితతిగ్మరుచిమధ్యునకున్.

42