Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈవిచేత, ఘనున్ = గొప్పవాఁడైన - అనఁగాఁ బ్రసిద్ధినొందిన, వేంకటరాయనిన్ = వేంకట్రాయఁడను నాతని, భవ్యతేజున్ = ప్రతాపశాలియైన, వేంకటవరదున్ = వేంకటవరదుఁ డను నాతనిని, ఈనలువురిని, పుత్త్రులన్ సుతులను, కాంచెన్ = కనెను.

వ.

అందు.

32

టీక. అందు = ఆనలువురియందు.

తే.

అమరవరభూమిభృన్మస్తకములఁ గ్రిందు
పఱచునిజపాదకటకసత్ప్రౌఢిచేత
విమలధృతిఁ గేశవప్రాయణమున వెలయు
వేంకటాద్రియ యనఁ బినవేంకటాద్రి.

33

టీక. అమరవరభూమిభృత్ = దేవనగరమైన మేరుపర్వతముయొక్క, మస్తకములన్ = శిఖరములను, క్రిందుపఱచు = తగ్గుఁ జేయుచున్న, నిజ = తనయొక్క, పాదకటక = నితంబప్రదేశముయొక్క, సత్ప్రౌఢిచేత = ఔన్నత్యముచేత ననుట - మేరుపర్వతమునకంటె మించినదని తాత్పర్యము. అర్థాంతరము — అమరన్ = ఒప్పఁగా, వరభూమిభృత్ = రాజశ్రేష్ఠులయొక్క, మస్తకములన్ = తలలను, క్రిందుపఱచు = క్రిందుగాఁ జేయుచున్న - వంచికొనఁజేయుచున్న వనుట. నిజ = తనయొక్క, పాద = చరణములయం దున్న, కటక = నూపురములచేత నైన, సత్ప్రౌఢిచేతన్ = మ్రోఁతచేత ననుట - చినవేంకటాద్రి యెక్కుడుకడిమిచే బిరుదుగాఁ బాదములఁ దాల్చినయందియలఁ జూచి శత్రురాజులు మాఱాడక తలలు వంచుకొందురని తాత్పర్యము, విమల = నిర్మలమైన, ధృతి = ధైర్యముచేతను, కేశవ = వేంకటేశ్వరునికి, ప్రాయణమునన్ = ఉనికి యగుటచేతను - చినవేంకటాద్రి వేంకటేశ్వరుని నిరంతరభక్తిచే ధ్యానించుచుండుటవలన వేంకటేశ్వరస్వామియుఁ జినవేంకటాద్రి హృదయమందే వాసము చేయుచుండె నని తాత్పర్యము. అర్థాంతరము — వేంకటాద్రియ యనన్ = వేంకటాచలమే యనునట్టుగా, పినవేంకటాద్రి = చినవేంకటాద్రిరాజు, వెలయున్ = ఒప్పును.

చ.

క్షమయు నమోఘవిక్రమము సద్వినయంబు ప్రతాపమున్ సురూ
పము నవికారభావమును బ్రాభవశక్తియు నిత్యదానశీ
లముఁ దగ నొక్కటొక్కటి కలంకృతిఁ జేయఁగఁ దాల్చి శోభిలున్
విమలత నాకువీటిపురవేంకటరాయఁ డతిప్రసిద్ధుఁ డై.

34

టీక. ఆకువీటిపుర = ఆకువీటిపట్టణమున కధిపతి యయిన, వేంకటరాయఁడు = వేంకటరాయఁ డనురాజు, క్షమయున్ = సయిరణను, అమోఘ = మొక్కవోని, విక్రమము = బీరమును, సద్వినయంబు = మంచినమ్రతను, ప్రతాపమును = వేఁడిమిని, సురూపమును = చక్కఁదనమును, అవికారభావమును = వెక్కురుఁదనము లేమిని, ప్రాభవశక్తియున్ = దొరతనపుఠీవిని,