Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గల, శ్లేష = కూడికయొక్క, ఘటన = కూర్పును, ఒక్కొకతఱిని, అర్థాన్వయము = అర్థముల చేరిక, వేఱె యగుచు = భిన్న మగుచును, ఉనికి = ఉండుటయు, ఒక్కొకతఱిని, శబ్దాన్వయ = శబ్దముల చేర్చుటయొక్క, విభేదసంగతి = వేఱుపాటును, ఒక్కొకతఱిని, ఇవి = ఈక్రిందటఁ జెప్పిన శ్లేషాదులు, రెండుమూఁడు = రెండు గాని మూఁడు గాని, కూడుట = చేరుటయు, మఱియు, సముజ్జ్వలముగన్ = ఒప్పునట్లుగా ననుట, నాకు, తోఁచినగతిన్ = స్ఫురించునట్టివిధమున, పెక్కుపోకలు = పలుమార్గములు, అమరన్ = ఏర్పడునట్లుగా, రామభారతకథలు = భారతరామాయణములను, పర్యాయదృష్టిన్ = పర్యాయక్రమమున, చూచుసుమతులకున్ = పరికించునట్టిధీమంతులకు, ఏర్పడన్ = రామభారతకథలు వేఱువేఱ నేర్పడునట్లు, ఆచరింతున్ = రచియింతును, కృతి నని సంబంధము.

క.

ఒకకథ వినియెడితరి వే
ఱొకకథపై దృష్టి యిడిన నొకయర్థముఁ దోఁ
పక పోవుఁ గాన నేకా
ర్థకావ్య మెట్లట్ల వినగఁ దగు నొకటొకటిన్.

18

టిక. ఒకకథ = ఒక్కకథను, వినియెడితఱిన్ = ఆకర్ణించునట్టివేళ, వేఱొకకథపై = మఱియొకకథమీఁద, దృష్టి యిడినన్ = చూడ్కి యుంచినయెడల - తల పుంచిన ననుట, ఒకయర్థము = ఒకయర్థమేనియు, తోఁపకపోవుఁ గానన్ = స్ఫురింపకపోవును గనుక, ఏకార్థకావ్యము = ఒకయర్థముగల గ్రంథము, ఎట్లు = ఏప్రకారమో, అట్ల = ఆప్రకారమే, ఒకటొకటిన్ = ఒక్కొక్కయర్థమునుగా, వినఁగఁ దగున్ = ఆకర్ణింపవలయును.

తే.

ప్రభువుసత్కారఋణ మిందుఁ బాయు ననియు
శ్రీవిరూపాక్షసేవావిశేష మనియు
సుజను లిందు గుణాంశంబ చూతు రనియుఁ
జలిపితి నసాధ్యకృతి కిట్లు సాహసంబు.

19

టీక. ప్రభువు = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, సత్కార = సమ్మాన మనెడు, ఋణము = అప్పు, ఇందున్ = ఈకావ్యనిర్మాణమునందు, పాయు ననియున్ = తీరు ననుచును, శ్రీవిరూపాక్ష = విరూపాక్షదేవునియొక్క, సేవా = భజనవలన నైన, విశేషము = శ్రైష్ఠ్యమును కలుగు నని శేషము, అనియు, సుజనులు = పెద్దలు, ఇందున్ = ఈ కావ్యమునందు, గుణాంశంబ = మే లగుపట్టునే, చూతురనియున్ = కాంతురనియు, అసాధ్య = నెఱవేర్పఁదగని, కృతికి = ప్రబంధనిర్మాణమునకు, ఇట్లు = ఈలాగున, సాహసంబు = తెగువను, చలిపితిన్ = చేసితిని, “సలుపు” అనునీక్రియాపద మీరాఘవపాండవీయ ప్రాచీనలిఖితప్రతులయం దంతటఁ జాదిగా వ్రాయఁబడి యున్నది గాని