Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దక్షత = కౌశలము, ఇంత గల్మిన్ = ఇంతమాత్రము కలిగి యుండుటను, విశదంబుగన్ = తెల్లముగ, కాంచియు = తెలిసియు, నీమదిన్ = నీయుల్లమందు, ఫలాపేక్ష = ప్రయోజనాసక్తి, ఘనంబు గామిన్ = గొప్ప కాకపోవుటచేత - నీకుఁ గృతి చెప్పి దానఫలమును బొందుట గొప్ప యనుబుద్ధి లేమి హేతువుచేత నని భావము, ఇది యిట్టనన్ = ఈకృతి చేయుమనుటకు, కొంకెదన్ = జంకెదను - అట్లు వలదు గాని, ఓలలాటేక్షణభక్తిశీల = ఈశ్వరభక్తినిరతుఁ డయినవాఁడా - ఇది హేతుగర్భవిశేషణము, శ్రీవిరూపాక్షునకున్ = విరూపాక్షస్వామికి, అంకితంబుగన్ = పేర్కొనంబడినదిగా - శ్రీవిరూపాక్షునిపేర ననుట, శుభార్థము = మేలు గలుగుటకొఱకు, రాఘవపాండవీయమున్ = రాఘవపాండవీయ మనుగ్రంథమును, రచియించుట = ఒనర్చుట, నీకున్ = నీకును, ఇష్టము కాదె = అభీష్టమే కదా. ఫలాపేక్షచే నొనర్ప నిష్టము లేనివాఁడవైనను భగవదంకితముగఁ జేయ నిచ్ఛ గలవాఁడవు కావున శ్రీవిరూపాక్షునిపేర నీద్వయార్థకృతి నొనర్పు మని తాత్పర్యము.

వ.

అని సవినయభక్తికంబు లగుమధురభాషణంబుల నిజాభిలాషంబు
తెఱం గెఱింగించిన నేనునుం దదీయంబు లగునతిమాత్రగౌరవ
సంభావనాదివిశేషంబులచేతం బ్రీతచేతస్కుండ నై యునికిం జేసి
శక్యాశక్యవిచారంబు లేక యంగీకారభంగీతరంగితం బగునంత
రంగంబుతో నతని నభివీక్షించి.

14

టీక. అని = ఇట్లని, సవినయభక్తికంబులు = వినయభక్తిసహితములు, అగు = అగునట్టి, మధురభాషణంబులన్ = తియ్యనిమాటలచే, నిజాభిలాషంబు తెఱంగు = తనకోర్కిరీతిని, ఎఱింగించినన్ = తెలిపించినను, తదీయంబులు = అతనివి అగునట్టి, అతిమాత్రగౌరవ = ఎంతయు గారవముతోఁ గూడిన, సంభావనాదివిశేషంబులచేత = వింత లగుమన్ననలచే, ప్రీతచేతస్కుండ నై = సంతసించినహృదయము గలవాఁడ నై, ఉనికిం జేసి = ఉండుటచేత, శక్యాశక్యవిచారంబు = కాఁదగుఁ గాఁదగ దనుచింత, లేక, అంగీకారభంగీ = ఒప్పికోలువిధముచే, తరంగితం బగు= పెనుపఁబడినట్టి, అంతరంగంబుతోన్ = చిత్తముతోను, ఇ ట్లంటిని = ఈలాగునఁ బల్కితిని.

ఉ.

రాఘవపాండవీయకథ రమ్యముగా నొకకావ్యసృష్టి నా
హా ఘటియింపఁగా వశమె యాంధ్రకవీంద్రుల కైనఁ దావక
శ్లాఘనపూర్వకోక్తి యవిలంఘ్యము గావునఁ గోవిదానుకం
పాఘనబుద్ధిఁ జూపెదఁ జమత్కృతిమత్కృతి మత్కృతిత్వమున్.

15

టిక. ఆంధ్రకవీంద్రుల కయినన్ = ఆంధ్రకవిశ్రేష్ఠుల కేనియు, రాఘవపాండవీయకథ = రామాయణభారతములను, రమ్యముగాన్ = ఒప్పిదముగా, ఒకకావ్యసృష్టిన్ =