Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. బహువనములుగల, చిత్రకూటముఖ = చిత్రకూటము మొదలయిన, పర్వతములయొక్క, చక్రము = సమూహమును, అతిక్రమించి, విశ్వహితుఁడు = రాముఁడు, దండకాశ్రమనివాసులు = మునులు, కొంచుఁబోవన్ = తోడ్కొనిపోఁగా, తత్ = ఆమునులచేత, ప్రహిత = కృతమైన, సపర్యుఁడై = పూజగలవాఁడై, “సవర్యా తర్పణం బలిః” అని అ. ఆత్మ = తనయొక్క, విశుద్ధసత్వగుణముగల, విగ్రహ = శరీరముయొక్క, “శరీరం వర్ష్మ విగ్రహః” అని అ. ఘనలక్ష్మి, పావని = పవిత్రమైనది, లక్ష్మికి విశేషణము, చూపఱకుఁ గన్నులపండువుగాఁగ నలరెను.

భారత. బహువనములచేతఁ జిత్రములైన, కూటముఖ = శిఖరాదులుగల, “కూటో స్త్రీ శిఖరం శృంగ” మని అ. పర్వతచక్రమును, విశ్వహితుఁడు = ధర్మరాజు, దండకున్ = సమీపమునకు, ఆశ్రమనివాసులు, అలరెను, పావని = భీముఁడు, “పవనస్యాపత్య” మ్మను నర్థమందు అత ఇఞ్ = అని యిఞ్ ప్రత్యయాంతము. ఆత్మ = తనయొక్క, విశుద్ధసత్త్వ = మంచిబలిమిగల, విగ్రహలక్ష్మిచేత, కన్నులపండువుగాఁగ, కిమ్మీరునిఁ గూల్చె ననుపర్యంతము నేకయోజన.

క.

సతియును దానును నతివి
శ్రుత మగుతనబలిమి నమితసుమనఃకిమ్మీ
రతరశ్రీదృత మగునతి
వితతాటవిఁ గొంకులేక విహరించుతఱిన్.

29

భా. సతియును దానును = ద్రౌపదియు దానును, తనబలిమి చేత, అమిత= అణఁపఁబడిన, సుమనః = దేవతలు గల, కిమ్మీర = కిమ్మీరుఁ డనురాక్షసునియొక్క, తర = బలిమియొక్క, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి" అని అ. శ్రీ = సంపదచేత, దృత = ఆదరింపఁబడినదైన, అటవియందు.

రామ. సతియును దానును = సీతతోఁ గూడి, బలిమిన్ = బలిమిచేత, అమితసుమనః = అధికపుష్పములచేత, “స్త్రియస్సుమనసః పుష్ప” మ్మని అ. కిమ్మీరతర = మిక్కిలిఁగర్బురవర్ణ మైన, "చిత్రకిమ్మీరకల్మాషశబలైతాశ్చ కర్బురే" అని అ. కడమ సరి.

శా.

దోరాస్ఫాలకరాళితోద్ధతి విరాధున్ నీలశైలోపముం
దారధ్వానయుతాట్టహాసవిసరద్దంష్ట్రామయూఖాళిఁ గి
మ్మీరాభిఖ్యఁ దనర్చురాక్షసు మదమిష్టోక్తు లాటోపదు
ర్వారాకృష్టమహీజుఁ డై వదరుగర్వగ్రస్తుఁ గూల్చెన్ ధరన్.

30

రామ. దోః = భుజములయొక్క, “దోః ప్రవేష్టభుజో బాహుః” అని వి. ఆస్ఫాల = మల్ల చఱచుటచేత, కరాళిత = అతిభయంకరముగాఁ జేయఁబడిన, ఉద్ధతిన్ = ఔద్ధత్యము,