Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డు. విశ్వనాథకవిరాజు [సాహిత్యదర్పణము X. 13.] రసపరిపంథియగుటచేఁ బ్రహేళిక యలంకారము కా దనియు, నిది 'ఉక్తివైచిత్ర్య'మాత్రప్రయోజక మనియు వ్రాసియున్నాఁడు. అంతకుమునుపే భోజుఁడు 'సరస్వతీకంఠాభరణము’నఁ బ్రహేళికాప్రయోజనములకు దండిశ్లోకము నుదాహరించియున్నాఁడు:

“క్రీడాగోష్ఠీవినోదేషు తద్జ్ఞై రాకీర్ణమన్త్రణే
పరవ్యామోహనే చాపి సోపయోగాః ప్రహేళికాః.'

ఈశ్లోకము రసార్ణవమున గ్రహింపఁబడినది [3.82.]

దండి చెప్పినప్రహేళికాభేదములకు ప్రకాశవర్షుఁడు చెప్పినవానికి సాదృశ్యము లేదు.]

యమకము 7 తరగతులు:

1. అవ్యపేతము. (నియతము).
2. అవ్యపేతము. (అనియతము),
3. వ్యపేతము. (నియతము).
4. వ్యపేతము. (అనియతము).
5. అవ్యపేతవ్యవేతకము. (నియతము).
6. అవ్యపేతవ్యవేతకము. (అనియతము).
7. సముద్గకము.

భామహునిమతమున యమకము 5 విధములు: 1. ఆది. 2. మధ్యాన్తము. 3. పాదాభ్యాసము. 4. ఆవలి. 5. సమస్తపాదయమకములు.

సందష్టక - సముద్గకాదిభేదముల నీతఁ డీయైదింటిలోనే యిమిడ్చెను. ప్రకాశవర్షుఁడు పేర్కొనిన యేడిటికి నధికముగా దండికృతియం దీ 5 ను వివరింపఁబడినవి: 1. సందష్ట, 2. సముద్గ, 3. శ్లోకాభ్యాస, 4. మహాయమక, 5. ప్రతిలోమయమకములు. ఇతరులు కొందఱు సందషమును దక్కినభేదములలో నంతర్భూతముగా నొనర్చినను దానుమాత్రము దీనికిఁ బ్రత్యేకస్థానము నొసఁగుచున్నాఁడ నని దండి చెప్పియున్నాఁడు. తనకృతిలో(III పరి.) నీతఁడు యమకభేదముల 78 శ్లోకములలో వివరించియున్నాడు.