పుట:మార్కండేయపురాణము (మారన).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వారు దండింప నొడయలు గారు నీవ, యొడయఁడవు నృపోత్తమ! ధర్మయుక్తి నెంత
దాఁక నభిషేకజలము లదలకు రావు, రాకొమరుఁ డంతదాఁక భోగైకపరుఁడు.

232


క.

అట మీఁద ధరణిపాలన, పటుకర్మములందుఁ దగిలి బహుదుఃఖము లం
దుట గాక యతని కత్యు, త్కటభోగపరత్వ మొండు గలదె నరేంద్రా.

233


క.

మహివల్లభునకు దేహ, గ్రహణము భోగములకొఱకుఁ గాదు ధరిత్రీ
వహననిజధర్మపాలన, బహుదుఃఖనిరంతరానుభవమునకు నృపా!

234


క.

ఇహలోకమున మహీపతి, బహుదుఃఖము లనుభవించి పరలోకమున
న్బహుకాల మప్సరోవర, మహిళాసంభోగసౌఖ్యమహనీయుఁ డగున్.

235


వ.

కావున నింతయు విచారించి రాజ్యభోగంబులు పరిత్యజించి ధరణీపాలనక్లేశంబు
లంగీకరింపు మచారుండ వగుటం జేసి భుజంగకృతద్విజమరణంబు గాన నేర వైతి
వేయును జెప్పనేల దుష్టనిగ్రహం బొనరించి శిష్టప్రతిపాలనంబునం దదీయధర్మం
బునం దాఱవభాగం బందుము రక్షింపక యుపేక్షించి తేని దుష్టకృతదురితం
బంతయు నిన్నుఁ బొందు నిది యసందిగ్ధం బని నిజపితృజనని చెప్పఁ బనిచినవిధంబు
సమస్తంబును జెప్పితి నిందు నీమనంబున కెయ్యది రుచి దానిని చేయు మనిన
మునివచనంబులు విని మరుత్తుండు లజ్జాయతచిత్తుం డగుచుఁ దన్నుం దాన
నిందించుకొని నిట్టూర్పునిగిడించి యప్పుడు.

236

మరుత్తుఁడు సంవర్తాస్త్రముచే నాగలోకముఁ దపింపఁ జేయుట

క.

ధనువును దివ్యాస్త్రంబులు, గొని యౌర్వునియాశ్రమమునకుం గడువేగ
మున నేఁగి పితామహికిని, మునులకుఁ బ్రణమిల్లి రాజ్యముఖ్యుం డెదురన్.

237


ఉ.

పాములచేతఁ జచ్చి భువిఁ బడ్డమునీంద్రులఁ గాంచి పార్థివ
గ్రామణి యుల్ల ముమ్మలికఁ గాలఁగఁ బల్మఱుఁ దన్ను దిట్టుకొం
చేమఱి యింతపాపమున కే నెలవైతినె? దుష్టపన్న గ
స్తోమము నాభుజబలముసొంపునఁ బెంపును నేపు దించెదన్.

238


చ.

అని పటుకోపపావకశిఖారుణితాంబకదీప్తవక్త్రుఁడై
యనిమిషయక్షకిన్నరవియచ్చరమానవులార! చూడుఁడీ
యనుపమపుణ్యమూర్తుల మహాత్ముల నిమ్మునుల న్విషాగ్నిఁ ద్రుం
చినయహికోటి నెల్ల నెటు చేసెదనో భుజవీర్యసంపదన్.

239


క.

అని పలికి మరుత్తుఁడు రయమున సంవర్తకమహాస్త్రముం దొడి పవనా
శననాశమునకు నై యేసిన నది దుర్వారవహ్నిశిఖ లెగయంగన్.

240