పుట:మార్కండేయపురాణము (మారన).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కలితముగా నొనర్ప ఘనగాత్రభయంకరవక్త్రశక్తు లు
జ్జ్వలతరనేత్రశూలరుచిజాలకరాళకరోగ్రమూర్తు లై.

28


సీ.

కృత్యాచతుష్టయం బత్యద్భుతంబుగ నుద్భూత మై కడునుగ్రగతి ఖ
నిత్రుపాలికిఁ జని నిర్దోషుఁ డైనయాతనివినిర్మలగుణోత్కరముచేత
హతిఁ బొంది మరలి రయమునఁ బురోహితవితతిపై నావిశ్వవేదిమీఁదఁ
బడిన నందఱు వెస భస్మమై రవ్విధం బచ్చెరు వందించె నఖిలజగము


ఆ.

నంత నమ్మహీశుఁ డాపురోహిత రు, లొక్కమాఱె మంత్రియుతము గాఁగ
విగతజీవు లగుట విని కడువెఱఁ గంది, యిట్టు లగుట కకట! యేమి కతమొ?

29

తమ్ములు మొదలగువారు నశించుటచే దుఃఖితుఁ డై ఖనిత్రుఁడు దివి కేఁగుట

క.

అని మదిలోన ఖనిత్రుఁడు, వనరుచు నుండఁగ మునీంద్రవంద్యుఁడు విజ్ఞా
ననిధి వసిష్ఠుం డేతెంచిన నతనికి వందనంబుఁ జేసె వినీతిన్.

30


వ.

అన్నరేంద్రుండు మునీంద్రా! మదీయభాతృవరుల మంత్రిపురోహితు లొక్క
మాటె యేమికారణంబున మరణప్రాప్తు లై రెఱింగింపవే యనిన నత్తపోధనోత్త
ముండు తద్వృత్తాంతంబు సవిస్తరముగాఁ జెప్పిన విని విషణ్ణత్వంబు నొంది తన్నుఁ
దాన నిందించుకొనుచు నతం డి ట్లనియె.

31


క.

అనుపగతపుణ్యగతిశో, భను దైవోపహతు నల్పభాగ్యుని దోషా
తుని నఖిలలోకగర్హితు, నను నిస్సీ యేమి చెప్ప నానాఘమయున్?

32


తే.

నానెపంబున సమసిరి నలువు రవని, సురవరేణ్యులు కటకటా! ధరణిఁ బాప
కరుఁ డెవ్వఁడు గలఁడు నాకంటె? నింక, నేమి సేయుదు దైవమ! యెందుఁ జొత్తు?

33


క.

ఈయిలను నొక్కపురుషుఁడ, నై యేను జనియింపకున్న నాద్విజులకు రా
నీయెడ రిటు పాపంబునఁ, బోయితి నీకష్టతరపుఁబుట్టువుకతనన్.

34


చ.

చెనఁటి నృపాన్వయోద్భవము సీ! యిది గొల్పనె పాపహేతు వై
తనరెడురాజ్య మేల? వసుధామరవర్యులు నాదుతమ్ముల
న్ఘనతరరాజ్యవర్ధనులు గా నొనరింపఁ గడంగి నాకతం
బున మృతులైరి పాపమునఁ బోయితి వేయును జెప్ప నేటికిన్.

35


వ.

అని విషాదవేదనాదూయమానమానసుం డై యప్పుడు ఖనిత్రధాత్రీపతి నిజ
ప్రథమపుత్రు నిఖిలరాజ్యాభిషిక్తునిం గావించి మువ్వురుభార్యలుం దానును
వనంబునకుం జని వానప్రస్థవిధానంబున నొక్కయాశ్రమంబున వసియించి నిఖి
లేంద్రియంబుల నిగ్రహించి మున్నూటయేఁబదిసంవత్సరంబులు దారుణం బగు
తపం బొనరించి శరీరం బుజ్జగించి ధర్మపత్నీసహితం బక్షయపుణ్యలోకప్రాప్తుం
డయ్యె నని చెప్పి మార్కండేయుండు.

36


క.

వినుము ఖనిత్రచరిత్రము, వినినఁ బఠించినను జనులు వీతాఘులు శాం
తినిరూఢులు శ్రీమంతులు, ననుపమశుభయుతులు సుఖులు నగుదురు ధరణిన్.

37