పుట:మార్కండేయపురాణము (మారన).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రుర్వి యేలునాతఁ డుద్ధరింపఁడు నెయ్య, మెసఁగ భ్రాతృజనము నింత దెలియ
నేర కునికి యధిప! నీమోస భాతృపు, త్త్రులకు నేల మీఁదఁ గలుగుఁ బొందు.

14


క.

వారలకొడుకులు దమలో, నారయ లాఁతు లయి పోదు రంతట నోధా
త్రీరమణ! భాతృసంతతు, లేరూపునఁ గూడి నడుచు నే సప్రీతిన్.

15


వ.

కావున నల్పరాజ్యపదస్థుం డగు నీవు వృథాసంతోషం బేల వహించెదు సకలరా
జ్యంబు నిన్నుఁ బొందునట్లుగా విచారింపుము విచారింపవై తేని మంత్రుల మైన
మాప్రయోజనంబు నీ కేటికి? మాచేతం గార్యజాతం బంతయు ఫలితం బైనఁ
బితృపైతామహం బైనరాజ్యం బంతయు ననుభవింపు మనిన నతం డి ట్లనియె.

16


క.

అతఁ డన్న యేము దమ్ముల, మతులిత మగుధరణివలయ మతఁడును మామా
క్షితిభాగము లేమును సు, స్థితి నేలుచు నునికిసేయుఁ జిత్తప్రీతిన్.

17


వ.

అది యెట్లంటేని వినుము.

18


క.

ఏవురము సోదరుల మే, మేవురకును వేఱ వేఱ యీయొక్కధరన్
శ్రీవిభవైశ్వర్యోన్నతు, లేవిధమునఁ గలుగ నేర్చు నీతలఁ పేలా.

19


వ.

అనుడు విశ్వవేది యమాత్యుం డిట్లనియె.

20


ఆ.

అధిప మీర లేవు రైన నెగ్గేమి మీ, యన్న మీపదంబులంద నిలిపి
యందఱకును నీవ యధిపతి వై బాహు, లీల మెఱయ నేల యేలు మనిన.

21


వ.

శౌరి యిట్లనియె.

22


క.

తనయునికంటెను నను న, మ్మనుజేంద్రుఁడు గరము నెమ్మి మన్నించు మన
మ్మున నట్టి యగ్రజన్ముని, యనుపమరాజ్యమున కలుగ నగునే నాకున్.

23


వ.

అనిన వేద్యవిదుం డగుసచివుం డతని నాలోకించి.

24


తే.

నీవు రాజ్య మంతయుఁ గొని నెమ్మి నగ్ర, జుని సమగ్రధనంబులఁ దనుప రాదె
వినుము రాజ్యకాముకులకు మనుజనాథ, వర్య! యన్నతమ్ముం డనువావి గలదె?

25


చ.

అనవుడు నట్ల కాక యని యానరనాయకుఁ డాత్మ సమ్మతిం
చిన నెడ విశ్వవేది వికసిల్లుచు నాతని భాతృపుత్త్రుల
న్మునుకొని తత్పురోహితులు మువ్వురనుం బిలిపించి యేకత
మ్మున నిజకార్య మంతయును బొచ్చెము లే కెఱిఁగించి చెచ్చెరన్.

26


వ.

ఆమువ్వురు పురోహితులం దనపురోహితుం గూర్చి ఖనిత్రునకు నాభిచారంబు
వేల్వంబంచి యావిశ్వ వేది యమ్మహీశ్వరుభృత్యామాత్యులందు సామదానాదులు
జేసి భేదం బాపాదించి దండనీతిస్ఫురణంబు మెఱయ సంగరోద్యోగంబునుం
జేసె నంత.

27


చ.

తలకొని విశ్వవేదికృతిఁ దద్దయు నుధ్ధతు లై పురోహితు
ల్నలువురు నాభిచారిక మనారతము న్బహుమంత్రతంత్రసం