పుట:మార్కండేయపురాణము (మారన).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాన నిచ్చితి నీకు నయ్యతివఁ బెండ్లి, గమ్ము నను సత్యవాక్యుని గా నొనర్పు.

279


ఆ.

అనిన నక్కుమారుఁ డధిప నీపనిచిన, కరణి నడచువాఁడఁ గాక యిప్పు
డేను గార్యకర్త నే? యనుటయును బెం, పార నప్పు డవ్విదూరథుండు.

280


వ.

శుభముహూర్తంబున వత్సంధ్రముదావతులవివాహంబు చేసిన భనందనందనుండు
పరమానందంబున సునందాసహితంబుగా నిజపురంబున కరిగి.

281


క.

అతిముదమునఁ దాను ముదా, వతియును లలి నుపవనముల వనజాకరతీ
రతలములఁ గృత్రిమప, ర్వతముల మణిరుచిరహర్మ్యరమ్యస్థలులన్.

282


వ.

మనోహరవిహారంబు లొనరించుచుండి రంతఁ బెద్దకాలంబున భనందుండు జరా
క్రాంతుండై వత్సంధు నఖిలమహీరాజ్యభారధౌరేయుం గావించి తాను దపో
వనంబునకుఁ జనుటయు.

283


శా.

ఆవత్సంధ్రమహీశ్వరుం డతులరాజ్యశ్రీధురం దాల్చి తే
జోవిభాజితమూర్తి యై సమధికస్పూర్తిం బ్రజాపాలన
ప్రావీణ్యంబుం నొప్పెఁ దద్వసుమతీభాగంబు శోభిల్లెఁ జో
రావగ్రాహవిరోధిడాంబరభయవ్యాధివ్యపేతస్థితిన్.

284

ఆశ్వాసాంతము

ఉ.

వారవిలాసినీవదనవారిజమిత్ర! సమగ్రవిద్విష
ద్భూరుహవీతిహోత్ర! గుణభూషణభూషితగాత్ర! నిర్మలా
చారపవిత్ర! సూరివనచైత్ర! వివర్ధితగోత్ర! భూమిపం
కేరుహకేళిలోలసితకీర్తిరమేశ్వర! పూజితేశ్వరా!

285


క.

శరనిధిసమగాంభీర్యా, మరుదగనిభధైర్య! సతతమహితౌదార్యా
సురపురసదృక్ష కాకతి, నరపాలకకటకపాలనస్థిరశౌర్యా!

286


మాలిని.

నిరతగుణధురీణా! నీతివిద్యాప్రవీణా!
పరభయదకృపాణా! భామినీపంచబాణా!
స్ఫురితవివిధపుణ్యా! సూరిలోకాగ్రగణ్యా!
దలితరిపుశరణ్యా! దానకేళీవరేణ్యా!

287


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహా
పురాణంబునందు దక్షసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి మనువుల సంభవంబులు
రౌచ్యమనూత్పత్తియు భౌత్యమనుజన్మంబును సూర్యునిప్రభవంబును బ్రభా
వంబును రాజ్యవర్ధనాఖ్యానంబును నిలునిపుట్టుటయుఁ బురూరవస్సంభవంబును
బృషధుడు శూద్రత్వంబు నొందుటయు ధృష్టపుత్రుండగునాభాగునకు
వైశ్యకన్యకకు భనందుం డుదయించుటయు దచ్చరిత్రంబును వత్సంధ్రచరిత్రం
బును ననునది సప్తమాశ్వాసము.