పుట:మార్కండేయపురాణము (మారన).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైవస్వతమనుసంతతికథనప్రారంభము

వ.

ఈదృగ్విధప్రభావుం డగువిభాకరునకు సర్వార్థప్రదర్శనుం డైనవైవస్వతుండు
సప్తమమను వై జన్మించె నతనికిఁ బుత్త్రు లిక్ష్వాకుండును నరిష్యంతుండును గరూ
షుండును వృషధ్రుండును నాభాగుండును ధృష్టుండు ననువార లావిర్భవించి
శస్త్రాస్త్రపారగులును వివిధవిద్యావిశారదులును బలపరాక్రమవంతులును వినిర్మల
స్వాంతులును దిగ్భరితకీర్తులును సౌమ్యమూర్తులును బ్రత్యేకరాజ్యరక్షాదక్షు
లును వినిర్జితప్రతిపక్షులును ననం జాలి యుల్లసిల్లి రమ్మనువు వెండియు సుగుణ
సుందరుం డగునందనుం బడయం దలంచి మిత్రావరుణుల నుద్దేశించి యొక్క
యధ్వరం బాచరించిన నందు హోతృక్రియావైకల్యంబునం జేసి యిలాభిధాన
యొక్కకన్య ప్రభవించినం జూచి యతండు మిత్రావరుణులం దలంచి ప్రస్తవ
పూర్వకంబుగా ని ట్లనియె.

184


ఉ.

కడుభక్తి న్మిముఁ గొల్చి మీదయఁ ద్రిలోకఖ్యాతు సత్పుత్త్రు నేఁ
బడయం గోరఁగఁ గూఁతు రిప్పు డుదయింపం బాడియే యిప్పు డీ
పడఁతిం పుత్త్రునిఁజేసి మీ దగుకృపాప్రావీణ్యముం బెంపు నే
ర్పడ నాకోరిక మూరిఁబోవఁగఁ గృతార్థత్వంబు నొందింపరే.

185


వ.

అని ప్రార్థించినం బ్రసన్ను లై వా ర ట్లనుగ్రహించిన.

186


క.

ఇల యనునభిధానంబునఁ, బొలిచిన యక్కన్య యపుడు పురుషుండై తా
నిలుఁ డన సుద్యుమ్నుం డన, వెలనె న్ధారుణి ననంతవిశ్రుతమహిమన్.

187


క.

ఆసుద్యుమ్నుఁడు మృగయా, వ్యాసక్తి నుమేశుఁ డున్న వనమధ్యమునం
దాపవ యెఱుఁగక తిరుగఁగ, నాసురముగ నలిగి రుద్రుఁ డాతనితోడన్.

188


తే.

మగువ వై యుండి పడసిన మగతనంబు, మెఱయ నిటు వచ్చినాఁడవే మేలు మేలు
దుర్మదాంధ! యీమద మేల తొంటియట్ల, పొలఁతి నగుమన్న నతఁ డప్డు పొలఁతి యయ్యె.

189


ఉ.

ఆయిలయందు సోమసుతుఁ డైనబుధుండు పురూరవు న్గుణ
శ్రీయుతుఁ జక్రవర్తి నధరీకృతభాస్కరతేజుఁ గాంచెఁ దా
నాయిల యశ్వమేధసవనాచరణంబునఁ బుంస్త్వవిస్ఫుర
త్కాయము దాల్చి విస్మయముగా నిలుఁ డై విలసిల్లెఁ గ్రమ్మఱన్.

190


తే.

తనయు లమ్మహీపతికి నుత్పలుఁడు గయుఁడు, వినతుఁడును నాఁగ మువ్వు రావిర్భవించి
బహువిధాధ్వరకర్తలు బాహువీర్య, యుతులు నై లీలఁ బాలించి రుర్వి యెల్ల.

191