పుట:మార్కండేయపురాణము (మారన).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్యానీకంబు న్మహోత్సాహమున వెడలె దేవాసురశ్రేణి కయ్యెం
దా నంతం గయ్య ముద్యత్పటుతరశరజాతప్రభ ల్మింటఁ బర్వన్.

107


క.

ఆతుములరణాంతరమున, నాతతమార్తాండతనుభవైకమరీచి
వ్రాతహతిఁ జేసి భస్మీ, భూతు లయిరి దైత్యదనుజపుంగవు లెల్లన్.

108


శా.

ఆమార్తాండు సమస్తదైత్యదనుజవ్యాపాదనప్రౌఢుఁ దీ
వ్రామేయారుణదేహదీప్తివిసరవ్యాప్తాఖిలాశాంతు సం
గ్రామోద్యద్విజయాభిరాము బహుమాంగళ్యప్రదున్ ఋగ్యజు
స్సామాలంకరణోజ్జ్వలు న్దినమణి న్సద్భక్తచూడామణిన్.

109


క.

ముదమునఁ గీర్తించుచు న, య్యదితిం గొనియాడుచుం బ్రియం బెలరారం
ద్రిదశులు గైకొని రొగిఁ దమ, పదములుఁ గ్రతుభాగములుఁ బ్రభాకరుకరుణన్.

110


చ.

అతులకదంబపుష్పసదృశాంశులు క్రిందను మీఁదఁ బర్వఁగా
హుతవహచారుపిండతులితోజ్జ్వల మైన యవిస్ఫుటాకృతి
న్శతదళబాంధవుండు గగనంబున నుండి నిజాధికార ము
న్నతి నొనరించె లోకము లనారతము న్దను భక్తిఁ గొల్వఁగన్.

111

కురుదేశమునఁ దపనతాపిత యై సంజ్ఞ బడబారూపమునఁ దపము చేయుట

వ.

అంత విశ్వకర్మప్రజాపతి తనకూఁతు సంజ్ఞ యనుకన్యక నావివస్వంతునకుం బ్రణ
తుండై ప్రార్థించి పత్నిం గావించె నద్దేవికి వైవస్వతమనువును యముండును యము
నయుం బ్రభవించి రాసంజ్ఞకథావృత్తాంతం బంతయు మున్న యేను నీకుం జెప్పితి
విను మట్లు పితృసదనంబునకు సంజ్ఞ చనుటయు ఛాయావధూటివలన నెఱింగి
మార్తాండుండు రోషంబున మండుచు మామయింటికిం జనిన నతండు నతని
నభ్యర్చించి సాంత్వనవచనంబుల ననునయించి యిట్లనియె.

112


ఉ.

కోపము సంహరింపు విను గోపతి! నీపటుతేజ మోర్వఁగా
నోపక పోయి పేరడవి నున్నది సంజ్ఞ మనోహరోల్లస
ద్రూపము దాల్చి నీవు తనుఁ దోకొని పోవుట గోరి భూరిని
ష్ఠాపరతంత్ర యై తగిలి సంతతముం దప మాచరించుచున్.

113


క.

శతధృతివాక్యంబును నా, మతమును నీ కించు కేని మానుగ విను దీ
పిత మగునీరూపము శో, భితమును శాంతంబు గాఁగఁ బ్రీతి నొనర్తున్.

114

విశ్వకర్మ సూర్యతేజము నల్పము చేయుట

తే.

అనిన నొడఁబడి వెలుఁగుఱేఁ డట్ల సేయు, మని యనుజ్ఞ యిచ్చుటయును నాక్షణంబ
విశ్వకర్మ శాకాహ్వయద్వీపమునకుఁ, జని దినాధీశ్వరునిఁ జక్రమున నమర్చి.

115


క.

అతిరయమునఁ దిరుగునహ, ర్పతితేజము దరువఁ దరువ బలవద్భ్రమణో
గ్రత నా కంపించె జగ, త్త్రితయము త్రుటితాంశుపవనతీవ్రత్వమునన్.

116


వ.

అప్పుడు.

117