పుట:మార్కండేయపురాణము (మారన).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సురలు సత్వరజస్తమస్స్ఫురణ నొంది, యధికు లై యందఱకు ముఖ్యులైరి వారి
నజుఁడు భువనత్రయమునకు నధిపతులను, యజ్ఞభుజులను గావించె నాదరమున.

86


ఉ.

దాని సహింప కెంతయును దర్ప మెలర్పఁగ దైత్యదానవు
ల్పూని సురావలిం దొడరి భూరిరణం బొనరించి గెల్చి శౌ
ర్యానుగుణంబు గా జగము లన్నియుఁ జేకొని యాగభాగము
ల్మానుగఁ దార గైకొని రమందభుజాబలజృంభణంబునన్.

87


వ.

అంత.

88


క.

దితి దనుతనయులచేఁ దన, సుతు లపహృతరాజ్యు లగుటఁ జూచి యదితి దా
మతి వారి నవిచ్ఛిన్న, క్రతుభాగులఁ జేయఁదలఁచి కడుభక్తిమెయిన్.

89

అదితి సూర్యుని స్తుతించుట

మహాస్రగ్ధర.

సవితృం దేజోభిరాము స్సకలమునిజనస్తవ్యుఁ బ్రత్యక్షమూర్తిన్
దివిజేంద్రారాధనీయు న్దినకరుఁ ద్రిజగద్దీపకు న్విశ్వవంద్యున్
రవి నారాధింపఁ జొచ్చె న్మతి నదితి ప్రయత్నంబుతోడ న్నిరాహా
రవిధిస్వీకారనానావ్ర తనియమధురారమ్య యై సంతతంబున్.

90


వ.

అ ట్లారాధించుచు.

91


క.

పరమం బై సూక్ష్యం బై, పరిపూర్ణంబై సుషుమ్నఁ బ్రభవం బై సు
స్థిర మైనబ్రహ్మతేజము, ధరియించిననీకు మ్రొక్కెదను నే ద్యుమణీ!

92


క.

జగముల కుపకారంబుగఁ, దగుతఱి నుదయించుచున్న తావకవిలస
న్నిగమమయతీవ్రమూర్తికి, గగనమణికి మ్రొక్కెద న్బ్రకాశితభక్తిన్.

93


క.

ఘనవర్షార్థము రసమో, చనముం జేయుచును సకలజగమున కాప్యా
యనకర మగురూపము గల, ఘనాత్ముఁ డగునీకు వినతి గావింతు రవీ!

94


మ.

అని యద్దేవి నిరంతరంబును నిరాహారత్వముం బూని కీ
ర్తనముం జేయుచు భక్తితోడఁ దను నారాధింప నయ్యుగ్రద
ర్శనుఁ డుష్ణాంశుఁడు పెద్దకాలమునకుం బ్రత్యక్ష మై నిల్చె న
వ్వనితారత్నముముందర న్వితతభాస్వద్ధీధితు ల్పర్వఁగన్.

95


సీ.

నిలిచినఁ గనుఁగొని నిర్జరజనని భయం బంది దేవ! నభంబునందు
వెలుఁ గొందుచున్నని న్వీక్షింప నాకు శక్యము గనిమాడ్కి భూగతుఁడ వైనఁ
గానఁజాలక యున్నదానఁ బ్రసన్నుఁడ నగుము భవద్రూప మస్మదీయ
లోచనముల కిఫ్డు గోచరముగఁ జేయు మతిదయ ననుఁ జూడు మధికభక్తి


తే.

భరిత నైననాతనయులఁ బ్రమదలీలఁ, గావు మఖిలలోకంబులు గలుగఁజేయ
వాని రక్షింప నడఁగింప వలఁతి వీవ, కాని నీకంటె నన్యుండు గలుగఁ డెందు.

96


తే.

బ్రహ్మకేశవరుద్రరూపములు నీవ, యింద్రపావకయమజలధీశపవన
ధనదరూపము నీవ చంద్రధరమేది, నీంద్రభూవార్ధిరూపము లీవె తరణి.

97