పుట:మార్కండేయపురాణము (మారన).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంబూద్వీపవర్ణనము

తే.

ఎన్ని దీవులు జలనిధు లెన్ని నగము, లెన్ని వర్షంబు లెన్ని యిం దేఱు లెన్ని
యిలకుఁ జక్రవాళాద్రికిఁ గొలఁది యెంత, యినసుధాకరగతు లివి యెట్లు చెల్లు?

131


ఆ.

విస్తరింపు నాకు విన వేడ్క యయ్యెడు, ననిన భార్గవుండు విను మునీంద్ర!
మున్ను నీకుఁ జెప్పినన్నియ దీవులు, గాని వేఱ లేవు మాననీయ!

132


వ.

పృథివి పంచాశత్కోటియోజనవిస్తార యై యుండు నందు.

133


తే.

వినుము లక్షయోజనముల విస్తృతులఁ బ్ర, దీప్త మై యొప్పు నేరేడుదీవిఁ దొట్టి
యొక్కటొకటికి రెట్టియై యుండుఁ బ్లక్ష, మాదిగాఁ గలయద్దీపు లాఱు ననఘ!

134


క.

వితతలవణేక్షుమదిరా, ఘృతదధిదుగ్ధాంబుమూర్తికీర్త్యము లై యీ
క్షితి నోలిఁ గలుగు జలనిధు, లతివిమలత నొకటి కొకటి యవి యినుమడి యై.

135


వ.

లవణజలనిధివలయవలయితం బగు జంబూద్వీపంబు వినుము.

136


సీ.

హిమవంతమును నట హేమకూటంబును నిషధంబు మేరువు నీలగిరియు
శ్వేతాచలంబును శృంగవంతంబును నవి వర్షశైలంబు లయ్యె నడిమి
నిషధనీలంబులనిడుపు లొక్కొకలక్ష యవల రెండును మఱి యివల రెండు
నోలిన పదియేసివేలయోజనములు తక్కువ యై యుండు నొక్క టొకటి


తే.

విను మహాత్మ రెండువేలయోజనముల, పొడవు పఱపు గల్గి పూర్వపశ్చి
మాంబునిధులఁ గలసి యయ్యిరుమూడుకొం, డలును రత్నరుచుల వెలుఁగుచుండు.

137


వ.

ఇప్పర్వతత్రితయంబులమధ్యంబునం జంద్రార్ధాకారం బై యిలావృతవర్షంబు
శోభిల్లుఁ దానితూర్పున భద్రాశ్వవర్షంబును బశ్చిమంబునం గేతుమాలవర్షంబును
నతిశయిల్లు దానిదక్షిణంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబులు
నుత్తరంబున రమ్యకహిరణ్యకవర్షంబులు పొలుచు నయ్యిలావృతవర్షంబునడుమ
నెనుబదినాలుగువేలుయోజనంబులతనర్పును ముప్పదిరెండువేలయోజనంబులు
విూఁదివిస్తారంబును బదాఱువేలయోజనంబులపాతుఁను నంతియ క్రిందివెడల్పు
నుం గలిగి శరావంబుచందంబున సుందరం బై హేమనగంబు దేజరిల్లుచుండు.

138


క.

అక్కనకశిఖరి యెనిమిది, దిక్కుల నింద్రాదినిఖిలదిక్పతిపురము
ల్మిక్కిలి యగువిభవంబుల, నక్కజ మయి వెలుఁగుచుండు ననుపమచరితా!

139


వ.

చతుర్దశయోజనోత్సేధం బైనయమ్మేరుమధ్యంబున బ్రహ్మపురము శోభిల్లుచుండు.

140


క.

సితపీతాసితరక్త, ద్యుతు లమరఁగఁ గనకశిఖరితూర్పు మొదలుగాఁ
జతురాశల ధరణీదై, నతవిట్ఛూద్రావనీశవర్ణాఖ్యలతోన్.

141


తే.

ఆయుతయోజనోత్సధంబులై సురాద్రి, నాల్గుదిక్కుల విష్కంభనగము లొప్పు
మందరంబును నొగి గంధమాదనంబు, విపులమును సుపార్శ్వంబును విమలపుణ్య.

142


క.

విను మేకాదశశతయో, జనదీర్ఘము లేతదీయశైలాగ్రములం
దనరుచుఁ బడగలక్రియఁ గడ, పనగము నేరేడు రావి వటమును వెలయున్.

143