పుట:మార్కండేయపురాణము (మారన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వినుము మహావీర్యుఁడును ధాతకియు నను పుత్త్రులఁ బడసి తాఁ బుష్కరంబు
వారిపేళ్ళను రెండు వర్షము ల్గావించి యిచ్చి నాసవనుఁ డయ్యిరువురకును
నిరుపముఁ డగుభవ్యునికి జలదకుమార సుకుమారులును మణీచకుఁడు మఱియుఁ
దగుకుశోత్తరుఁడు మేధావియును మహాద్రుముండు పుట్టుటయు నతండు వారి


తే.

కేడువురకు శాకద్వీప మేడువర్ష, ములుగ నొనరించి యొసఁగిన వెలసె నవియు
వారిపేళ్లను బహువిధవస్తుబహుల, ములును విపులభోగాస్పదములును నగుచు.

124


వ.

ద్యుతిమంతుండు శలుఁడు మనోనుగుం డుష్ణుండు ప్రధానుం డర్థకారకుండు ముని
దుందుభి యనుసుతులకుఁ గ్రౌంచద్వీప మేడువర్షములుగ నేర్పరించె నవి తదీయ
నామాంకితంబులై పరఁగె జ్యోతిష్మంతుండును గుశద్వీపంబు సప్తవర్షంబులు చేసి
యుర్భిదుఁడు వైణవుఁడు సురథుఁడు లంబనుఁడు ధృతి ప్రభాకరుఁడు కవలుఁడు
ననుపుత్త్రసప్తకంబున కొసంగిన నవ్వర్షంబులు తదీయనామంబుల నతిశయిల్లె వపు
ష్మంతుఁడు, శాల్మలిద్వీపంబును శ్వేతుండు హరితుఁడు జీమూతుఁడు రోహితుఁడు
వైద్యుతుఁడు మానసుఁడు మహీధుఁడు ననుపుత్రులకు నేడుభాగములుగా విభా
గించి యిచ్చె నవ్వర్షంబులు తదభిధానఖ్యాతంబు లయ్యె మఱియును.

125


క.

వినుతప్లక్షద్వీపం, బును మేధాతిథి యొనర్చెఁ బుత్త్రులపేళ్ళం
దనరంగ సప్తవర్షము, లనుపమగుణ! వినుము తెలియ నవ్వర్షంబుల్.

126


వ.

శాంతభయంబును శిశిరంబును సుఖోదయంబును నానందంబును శివంబును క్షేమ
కంబును ధ్రువంబును ననం బరగెఁ బ్లక్షద్వీపంబుతుద శాకద్వీపంబు మొదలుగాఁగల
యేను జీవులును సర్వవర్ణాశ్రమాచారధర్మంబులు గలిగి యుండు జంబూద్వీపాధి
పతియైనయాగ్నీధ్రునికి నాభియుఁ గింపురుషుఁడు వారివర్షుం డిలావృతుండు
రమ్యుండు హిరణ్యుండు కురుండు భద్రాశ్వుండు కేతుమాలుండు ననం దొమ్మండ్రు
పుత్త్రు లుదయించి రందుఁ గింపురుషుఁ డాదిగా నెనమండ్ర హిమవదుత్తరభాగ
వర్షంబుల కధిపతులం గావించిన నవి వారిపేళ్ళం బ్రసిద్ధంబు లయ్యె నవ్వర్షంబు
లందు.

127


తే.

జరయుఁ దెవులును వగయును బొరయ వనఘ!, సుఖము లెప్పుడుఁ జుబ్బనచూఱ లెల్ల
వారు సములె చతుర్యుగావస్థ చెంద, దందుఁ బుణ్యపాపములు లే వమితపుణ్య!

128


తే.

హిమనగేంద్రదక్షిణవర్ష మేలునాభి, యాత్మనందను ఋషభుని నధిపుఁ జేసి
యరిగెఁ గానకు నతఁడు నిజాత్మజన్ముఁ, డైనభరతుఁ బట్టము గట్టి యడవి కరిగె.

129


వ.

ఆభరతునిపేర నివ్వర్షంబు భారతవర్షం బనం బొగడొందె భరతుండును నిజనంద
నుం డగుసుమతి నధిపతిం గావించి తపంబునకుఁ జనియె నివ్విధంబున స్వాయంభువ
మన్వంతరంబునం బ్రియవ్రతునిపుత్త్రులుం బౌత్త్రులును సప్తద్వీపంబులును బాలించి
రని చెప్పిన మార్కండేయునకుఁ గ్రోష్టుకి యి ట్లనియె.

130