పుట:మార్కండేయపురాణము (మారన).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుద్రసర్గము

సీ.

అజుఁడు కల్పాదియం దాత్మసన్నిభు నొక, యాత్మజుఁ బడయంగ నాత్మఁ దలఁచు
చుండ నద్దేవునియుత్సంగమున నొక్కనీలలోహితుఁ డగుబాలుఁ డుదయ
మై రోదనము సేయు నతని నేమిటి కేడ్చె దనుఁడు బ్రహ్మకు నిట్టు లనియె నతఁడు
నా కొక్కపే రిమ్ము నావుడు నవ్వేధ రోదనం బుడుగుము రుద్రుఁ డనగ


తే.

వెలయు మనిన నారుద్రుఁడు వెగచి వెగచి, యేడుమాఱులు మఱియును నేడ్చుటయును
నెఱిఁగి యతనికిఁ జతురాస్యుఁ డిచ్చెఁ బ్రీతి, నేడునామములు దగ మునీంద్ర! వినుము.

109


వ.

భవుండు శర్వుం డీశానుండు పశుపతి భీముం డుగ్రుండు మహాదేవుండు ననఁగ
నిట్లిచ్చిననామంబులఁ బరగి రుద్రుండు సూర్యాంబుమహీవహ్నివాయుగగనదీక్షిత
సోములన నెనిమిది మూర్తు లయ్యె నాసూర్యాదులకు సువర్చలయు నుమయు
వికేశియు స్వధయు స్వాహయు దిశలును దీక్షయు రోహిణియు వరుసను భార్యలై
రాభార్యలవలన శనైశ్చరుండును శుక్రుండును లోహితాంగుండును మనోజ
వుండును స్కందుండును స్వర్గుండును సంతోషుండును బుధుండును ననుపుత్త్రులు
పుట్టి రంత.

110


ఉ.

దక్షునినందన న్సతి ముదంబున రుద్రుఁడు పెండ్లి యయ్యె నా
దక్షునిమీఁదికోపమునఁ దత్సతి దేహము నీఱు చేసి తా
నక్షయపుణ్య మేనకకు నాహిమవంతునకు న్జనించె నా
దక్షమఘారి యగ్గిరిసుత న్వరియించెఁ గరంబు నెమ్మితోన్.

111


క.

ఆనగజతోడఁ బుట్టిన, మైనాకుఁ డనంతరత్నమహిమాన్వితుఁ డం
బోనిధి కిష్టసఖుం డై, తా నంద వసించి యుండెఁ దద్దయు నెమ్మిన్.

112

భృగ్వాదిసంతతి

క.

ఖ్యాతికి భృగునకుఁ బుట్టిరి, ధాతయును విధాతయును నుదాత్తగుణగణో
పేత యగులక్ష్మియును న, న్నాతికి నారాయణుండు నాథుం డయ్యెన్.

113


క.

మేరువు కన్యలఁ బెండిలి, యై రాయతినియతులను లతాంగుల నొగిఁ బెం
పారఁగ ధాత విధాత యు, దారుఁడు ప్రాణుండు పుట్టె ధాతకు నంతన్.

114


వ.

విధాతకు మృకండుఁడు పుట్టె మృకండునకు మనస్వినికి నేను జన్మించితి నాకు
ధూమ్రావతికి వేదశిరుండు పుట్టె ధాతృపుత్త్రుం డగు ప్రాణునికి ద్యుతిమంతుండు
ప్రభవించె ద్యుతిమంతునకు నజరుం డావిర్భవించె నిట్లు భృగునికి సంతానంబు
బహుళం బయ్యె.

115


క.

విను సంభూతిమరీచుల, కొనరంగాఁ బౌర్ణమాసుఁ డుదయించె నతం
డును విరజుండునుఁ బర్వతుఁ, డనుతనయులఁ బడసె మునిజనాగ్రేసరులన్.

116