పుట:మార్కండేయపురాణము (మారన).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శేషించియుండునది యెయ్యది నాకు విన వేడ్క యయ్యెడు నెఱింగింపవలయు
నన్న నప్పక్షివరులు ప్రహృష్టహృదయు లగుచు జైమినీ! నీచేసిన ప్రశ్నం బతిగహ
నంబు దానికిం జెప్పెదము వినుము తొల్లి క్రోష్టుకి యనుమునివరుండు నీవు మ
మ్మడిగినయట్లు మార్కండేయు నడిగిన నమ్మహాముని యతని కిట్లనియె నవ్యక్తంబు
వలన నావిర్భవించిన మాత్రన చతుర్ముఖునిముఖంబుల నిప్పురాణజాతంబును వేదం
బులు నుద్భవిల్లె వానిం దదీయమానసపుత్త్రు లగుసప్తమును లన్నలువవలనఁ బడసి
రట్టిపురాణజాతంబు భృగువువలనం జ్యవనుం డెఱింగి కొందఱు మునులకుం జెప్పె
నమ్మునులు దక్షునికి నుపదేశించి రాదక్షునిచేత నేమును వింటిమి తత్పురాణకథితం
బై కలికల్మషంబు నడంపంజాలునట్టిభూతసర్గంబు నెఱింగించెద మాకర్ణింపుము.

6

క్రోష్టుకికి మార్కండేయుఁడు చెప్పిన మహదాదిభూతసర్గము

తే.

అనఘ! యింతకుఁ గారణ మై ప్రధాన, మనఁగ నవ్య క్త మనఁగ నిత్యయును సదస
దాత్మికయు నతిసూక్ష్మయు నై వెలుంగు, నండ్రు మూలప్రకృతి విమలాత్మవిదులు.

7


వ.

ప్రకృతివలన మహత్తు పుట్టె మహత్తువలన నహంకారంబు పుట్టి సాత్వికంబు రాజ
సంబు తామసంబు ననం ద్రివిధం బై వైకారికతైజసభూతాదు లనుపేళ్ళఁ బరగె
నందు భూతాది యగుతామసాహంకారంబువలన శబ్దతన్మాత్రంబు దానివలన నాకా
శంబు నాకాశంబువలన స్పర్శతన్మాత్రంబు దాన వాయువు వాయువువలన రూప
తన్మాత్రంబు దాన నగ్ని యగ్నివలన రసతన్మాత్రంబు దాన జలంబు జలంబువలన గంధ
తన్మాత్రంబు దానం బృథివి యావిర్భవించె నిది భూతతన్మాత్రసర్గప్రకారంబు తైజసం
బగురాజసాహంకారంబువలన శ్రోత్రత్వక్చతుర్జిహ్వాఘ్రాణంబు లనుబుద్ధీంద్రియం
బులేనును వాక్పాణిపాదపాయూపస్థ లనుకర్మేంద్రియంబు లేనునుం బుట్టె వైకారి
కం బగుసాత్వికాహంకారమువలన నింద్రియాధిదేవతలతోఁ గూడ మనస్సు పుట్టె
శాంతంబు ఘోరంబులు మూఢంబులు విశేషంబు లనునామంబులం బరగునిమ్మహ్యాది
భూతంబు లేడును నానావిధవీర్యంబులు పృథగ్భూతంబులు నగుటం జేసి యేకత్వంబు
వెలిగాఁ బ్రజల సృజియింపంజాల విట్టిభూతసప్తకసంయోగంబున జలంబున నెసఁగు
బుద్బుదంబును బోలె నొకయండం బుద్భవిల్లి క్రమంబునం బ్రవర్ధిలి యుదకంబు
నందుండ నమ్మహాండంబునందు క్షేత్రజ్ఞుండు బ్రహ్మ యనుపేర శరీరియుం బ్రథమ
పురుషుండును నిఖిలభూతాదికర్తయు నై యుదయించె నతనిం బొదివినయుల్బంబు
మేరునగంబును జరాయువు పర్వతంబులును నయ్యుమ్మనీరు సముద్రంబులు
నయ్యె నొండొంటికిం బదేసిమడుంగు లెక్కు డైనపయస్తేజోవాయువియద్భూ
తాదిమహదవ్యక్తంబు లనుసప్తావరణంబుల చేత నయ్యండంబు పొదువంబడి
యుండు నిట్లబుద్ధిపూర్వంబును క్షేత్రజ్ఞాధిష్ఠితంబును నై తొలుతఁ బ్రాకృతసర్గం
బావహిల్లె ననిన మార్కండేయునకుం గ్రోష్టుకి యి ట్లనియె.

8