పుట:మార్కండేయపురాణము (మారన).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

వనితాపుత్రసుహృజ్జనావలులపై వైరాగ్య ముల్లంబున
న్దనరం గానకు నేఁగి వల్కలజటాధారుండు సద్బ్రహ్మచ
ర్యనిరూఢుండును గందమూలఫలశాకాహారసంతృప్తుఁడు
న్ఘనబోధామలినాత్మకుం డగుచు వానప్రస్థుఁ డుండు న్సుతా!

146


మ.

మతికాలుష్య మడంచి యింద్రియముల న్మర్దించి కామాదిశ
త్త్రుతతిం ద్రుంచి యసంగుఁడు న్సతతసంతుష్టుండు నారంభవ
ర్జితుఁడు న్నిర్మలుఁడు స్సమాధిపరుఁడు న్జిత్సంప్రబుద్ధుండు నై
యతి శోభిల్లు నిరంతరంబు విమలైకాంతప్రదేశస్థితిన్.

147


తే.

నాలుగాశ్రమములయందు నోలి నుండు, వారిధర్మంబు లెల్లను వరుస నీకు
నెఱుఁగఁ జెప్పితిఁ జెప్పెద నింక వినుము, సర్వవర్ణాశ్రమార్హలసద్గుణములు.

148


క.

క్షమయు నకార్పణ్యము శౌ, చము ననసూయయును నానృశంస్యము సంతో
షమును నహింసయు విను స, త్యము నెనిమిది వలయు గుణము లఖిలజనులకున్.

149


సీ.

సంక్షేపమున నిట్లు సర్వవర్ణాశ్రమధర్మము ల్సెప్పితి తనయ! వినుము
తమతమధర్మము ల్దప్పి దుర్మార్గులై దురితంబు లొనరించునరుల ధారి
ణీశుండు దండింప కెడ నుపేక్షించినఁ బొలియు నిష్టాపూర్తపుణ్యఫలము
లతనికిఁ గావున నతులప్రయత్నపరుం డయి సర్వవర్ణులను రాజు


తే.

విహితదండం బొనర్చుచు విమలధర్మ్య, కర్మపరులుగ సతతంబు గావవలయు
ననిన విని తల్లి కతివినయమున మ్రొక్కి, యయ్యలర్కుండు మఱియు ని ట్లనియెఁ దండ్రి!

150

గృహస్థధర్మనిరూపణము

తే.

జనుల కుపకారముగ గృహస్థునికిఁ జేయఁదగిన దెయ్యది విడువంగఁ దగిన దెద్ది?
తనకు సతతంబు నొనరింపఁ దగినయట్టి, దేది? యనుడు మదాలస యిట్టు లనియె.

151


చ.

అనఘ! గృహస్థధర్మపరుఁ డైననరుండు ద్రిలోకపోషకుం
డనుపమపుణ్యమూర్తి యతఁ డాతనిసంతతధర్మసంపద
న్మునిపితృదేవభూతగణముం గ్రిమికీటకపక్షిసంఘము
న్మనుఁ గనుఁగొంచు నుండుదురు మానక యర్థులు వానివక్త్రమున్.

152

త్రయీధేనువర్ణనము ఆయాదేవతలకు బలిహరణవిధియు

వ.

ఇట్టిగృహస్థునకుం జేయదగినధర్మంబు వినుము సకలలోకాధారభూతయు ఋగ్వే
దాపరభాగయు యజుర్మధ్యయు సామవక్త్రయు నిష్టాపూర్తవిషాణయు సాధు
సూక్తరోమయు శాంతిపుష్టిశకృన్మూత్రయు నైనత్రయీకామధేనువునకుం జతుస్తనం
బులు స్వాహా కారస్వధాకారవషట్కారహంతకారంబు లన బరగు వానిచే దేవ
పితృమునిమనుజవర్గంబులకు నాప్యాయనం బనుదినంబును నాచరింపవలయు నట్లు
సేయనిపురుషుండు దామిస్రనరకంబునం బడు మఱియు గృహస్థుండు నిత్యంబును
శుచిస్నాతుం డై దేవర్షిపితృతర్పణంబు లొనరించి సుమనోగంధధూపదీపంబుల