పుట:మాటా మన్నన.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సానుభూతితో వింటానికి, వాటి మంచి చెడ్డలను ఆలోచించటానికి సంసిద్ధపడాలి. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం .

ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే చక్కగా వినటం నేర్చుకోవాలి. ఎంతమందిఉన్నా సరే అందరూ చెప్పేది ఆలకించాలి.

నలుగురుకూ తెలిసినదానిని ఒక మనిషి చెపుతూ ఉంటే అది పూర్తిగాక పూర్వమే తాను చెప్పాలని పెరపెరలాడుతారు కొందరు. అది తప్పు, తనవంతు వచ్చేవరకు జాగ్రత్తగ వింటూ అప్పుడు మాట్లాడటం మంచిది. ఇట్లా పదిమంది కలసి ఒక విషయం మాట్లాడటంవల్ల భిన్న దృక్పధాలు తెలుస్తవి.

ఈ విధంగా కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు ప్రతిరోజూ సాయంకాలం అక్కడకు వచ్చే వారితో సంభాషణ చేస్తూ ఉండేవారు. వారంతా చర్చిస్తూ ఉండేవారు.

ఒకనాడు గాంధిమహాత్ముడు ఇర్వినుప్రభువు పిలుపు నందుకొని వెళ్లాలా ? అక్కర్లేదా ? అనే చర్చ సాగుతున్నది. కొంద రటూ, కొంద రిటూ మాట్లాడారు. చివరకు నార్ల వెంకటేశ్వరరావుగారు వచ్చేసరికి, 'చిన్నవాడైనా మన వెంకటేశ్వరరావు అభిప్రాయం తెలుసుకోతగింది' అన్నారు కృష్ణారావుగారు. అంతట నార్ల వారు 'అయినను పోయి రావలయు హస్తినకున్' అన్నారు కదండి తిరుపతి కవులు

25