పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

111


సీ.

అల్లునివద్దికి నంత నెంతయు వేడ్కఁ
        దనయఁ దోడ్కొనివచ్చి వినయ మమర
విజయరాఘవభూప! వినవయ్య నామాట
        బరఁగ మే మొనరించు భాగ్యమహిమ
[1]నల్లుఁడ వైతి వీ వందఱు గొనియాడ
        ధన్యుండ నైతిని ధరణిలోన
మమత నే సాఁకిన మందెమేలంబునఁ
        జెల్లుబడిగ నుండు నుల్లమునను


తే.

నేర్పునేరము లన్నియు నీవె యోర్చి
కరుణమీరఁగ నేలుమీ కన్య ననుచుఁ
దనర నప్పుడు మన్నారుదాసునకును
నొప్పగించెను మదిఁ బ్రేమ యుప్పతిలఁగ.

80


కాంతిమతిని దల్లి యాశీర్వదించుట; వధూవరు లూరేఁగుట

వ.

అయ్యవసరంబున.

81


సీ.

బంగారు తెంకాయ పండ్లును బసుపును
        దాంబూలములు క్షేమతండులములు
నొప్పైన రతనాల యొడిగట్టు గిన్నెయు
        నొడి బాలకృష్ణుని నొనరఁ దెచ్చి
తల్లి దా నొడి నించి తన ముద్దుపట్టినిఁ
        గౌఁగిటఁ జేర్పుచు గారవమున
వెలయంగఁ బతిఁగూడి వెయ్యేండ్లు మనుచును
        దనయులఁ గనవమ్మ తల్లి! నీవు


తే.

చెలఁగి పతిసేవ సేయుచు స్థిరముగాఁగ
వన్నె వాసియుఁ దేవమ్మ! వంశమునకు
సవతు లందఱు గొనియాడ జగతిలోన
సాటిలేకనె వర్ధిల్లు చల్లఁగాను.

82


వ.

అని దీవించిన.

83
  1. అల్లుఁడవైతివి అందరు గొనియాడ