పుట:మధుర గీతికలు.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోఁతులు


ఉరము క్రింది కిశోరంబు లూఁగియాడ,
తరువుపైనుండి వేఱొక్క తరువుపైకి
లీలఁ గుప్పించి, పండ్లికిలించికొంచు,
ముక్కు నులుముచు, వింతగా బొమలు త్రిప్పి,
ఎక్కసక్కెము లాడుచు వెక్కిరించి
కనులు చికిలించి కిచకిచ మనుచుఁ గూసి,
కొమ్మ నొకచేతితోఁ బట్టుకొనుచు వ్రేలి
యూఁగులాడుచు, నొకచేత నొడలు బఱికి,
గోట నిఱికిన పేలను నోట నిడుచు,
ఇలకు లంఘించి కుప్పిగంతులను వైచి,
వాలములఁ ద్రిప్పికొంచును వానరములు
వికృతచేష్టలఁ జేయుచు వెలయుచుండె.

46