పుట:మధుర గీతికలు.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగారు పండ్లు


అడవిదాపల నొకపూరిగుడి సెయందు
కాఁపురం బుండె ముదుసలికాఁపువాఁడు;
ఆతఁ డొకనాఁడు భూమిలో పాతుచుండె
చిన్నమామిడిటెంకల కొన్ని తెచ్చి.

వేఁటలాడఁగ నాదారివెంటఁ జనుచు,
తనదు పరివారజనులతో ననియె రాజు:
“కాంచితిరె మీర లీమూడుకాళ్ల ముసలి
చేయుచున్నట్టి చిత్రంపుచేఁత లౌర ?

“వృద్దుఁ డక్కట ! ఎంతటి వెఱ్ఱివాఁడు ?
విత్తుచున్నాఁడు మామిడివిత్తనముల,
చెట్లఫలముల తాను భక్షింపఁ దలఁచి;
ఎంతకాలము జీవింప నెంచినాఁడొ ?

16