పుట:మధుర గీతికలు.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గృహము


జగముకంటెను స్వీయదేశంబు ప్రియము,
దానికన్న ప్రియతరంబు తనపురంబు,
అంతకంటెను ప్రియతమ మాత్మగృహము;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?

‘తల్లి యైనను చేయంగ నొల్లనట్టి
మేలు లెల్లను సమకూర్పఁ జాలు నిల్లు'
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గానఁ
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె ?

‘తనకు గ్రాసంబు లేకున్నఁ మనఁగవచ్చు
కాని వాసంబు లేకున్న గడపరాదు'
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గాన,
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె ?