పుట:మత్స్యపురాణము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ద్వితీయాశ్వాసము


సీ.

అఖిలలోకనివాసు లను సురేంద్రుల కైన
        వసుధ జన్మింపక వనజనాభు
పదము నొందఁగ రాదు పరికించి చూచిన
        నచట లక్ష్మీశ్వరు నాత్మలోనఁ
దలఁచి నంతనె ముక్తి గలిగి యుండెడిచోట
        భూజనుల్ మాయాభిపూర్ణు లగుచు
సుజ్ఞానహీను లై యజ్ఞానసహితు లై
        పుత్త్రదారేషణస్ఫూర్తిఁ బొదలి
భుక్తిమైథుననిద్రాదిసక్తు లగుచుఁ
దెలివిఁ జిత్తంబుఁ గుదియంగఁ దివియ లేక
వివిధమార్గములఁ దిరిగి దివికి నడవఁ
గడగు మార్గంబు లరయంగఁ గాన రెచట.

18


వ.

ఇట్లు రేతస్సృష్టిసంభవు లగు ప్రాణికోట్ల కన్నమూలంబునఁ బ్రాణంబులు
నిలచుఁ దత్ప్రాణంబులవలన బలంబును, బలంబువలనఁ దపంబును, దపం
బువలన శ్రద్ధయు, శ్రద్ధవలన మేధయు, మేధవలన శాంతియు, శాంతివల
నఁ దమంబు నొదవు నాదమంబువలనఁ జిత్తస్థైర్యంబును నందువలన సమ్య
జ్ఞానంబును, సమ్యజ్ఞానంబువలనఁ బరమార్థదర్శనంబును గలుగు నట్లగు
టంజేసి తదన్నంబే బ్రహ్మస్వరూపంబుగా నెఱుంగుము. అట్టి యన్నంబు
భగవత్ప్రీతిగా విప్రులకు దానంబు సేయు గృహనివాసుండు విష్ణులోకంబు
న కరుగు నని చెప్పి నారదునకు మరియు నిట్లనియె.

19


క.

సుకుమార! వినుము నైమి
త్తిక మనఁగను మఱియుఁ బాకృతిక మన నాత్యం
తిక మనఁగను ద్రివిధము లై
యొకవీఁకను లయము లొదపు నురవడితోడన్.

20


క.

కాలప్రమాణ మెఱుఁగఁగఁ
గాలాత్మున కైన వశము కాదు లయంబుల్
కాలంబుకతనఁ దలఁకొను
నా లీలనె జగము లుదయ మందును దనయా.

21